Mariyamma lockup death case, Addaguduru cops dismissed: యాదాద్రి భువనగిరి: అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ కేసులో ఆమె చావుకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మహేష్‌తో పాటు రషీద్, జానయ్య అనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై శాశ్వతంగా వేటు పడింది. మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇటీవలే సస్పెండ్ అయిన ఎస్సై  మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను విధుల నుంచి తొలగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరియమ్మ లాకప్ డెత్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరియమ్మ చావుకు కారణమైన అడ్డగూడురు పోలీసులపై (Addaguduru police station) కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర గవర్నర్‌ని కలిసి అడ్డగూడురు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాయి. 


మరియమ్మ లాకప్ డెత్ కేసులో (Mariyamma lockup death case) ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ హై కోర్టు (Telangana high court) సైతం ఈ కేసుపై స్పందిస్తూ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరియమ్మ లాకప్ డెత్‌కి కారకులైన ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 


ఈ నేపథ్యంలోనే మరియమ్మ మృతిపై (Mariyamma death case) పూర్తిస్థాయిలో విచారణ జరిపిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్.. సస్పెన్షన్‌లో ఉన్న పోలీసులను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.