ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పలు మండలాలు గురువారం రాత్రి భూకంపం భయంతో వణికిపోయాయి. కొత్తగూడెం, సుజాత నగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో రాత్రి 11: 23 గంటలకు భూమి 5 సెకన్లపాటు కంపించడమే వారి భయాందోళనలకు కారణమైంది. భూమి కంపించడంతో నిద్రపోతున్న వారంతా చటుక్కున లేచి తమ ఇళ్లలోంచి బయటకు పరిగెత్తారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఎక్కడ భూకంపం వస్తుందోననే భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం తిరిగి లోపలికి వెళ్లేందుకు భయపడి రాత్రంతా ఇళ్ల ముందే జాగారం చేశారు. 


ఇదే విషయమై వాతావరణ శాఖ అధికారులు వివరణ కోరగా.. అవి చిన్నపాటి ప్రకంపనలు మాత్రమేనని.. అది భూకంపం కాదని స్పష్టంచేశారు. ప్రకంపనలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ఏదేమైనా ఓవైపు భూకంపం వస్తుందేమోననే భయం, మరోవైపు ఆరుబయట చలి తమచేత జాగారం చేయించిందని అక్కడి స్థానికులు వాపోయారు.