సీజనల్ జ్వరాలను అరికట్టేందుకు మంత్రి ఈటల చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రబలుతున్న సీజనల్ జ్వరాలపై మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు
తెలంగాణ ప్రాంతంలో సీజనల్ జ్వరాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్యులు సెలవులు పెట్టొద్దని మంత్రి ఈటల ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు సూర్యపేటలో పర్యటించిన మంత్రి ఈటల ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులకు టీకా వేశారు. అనంతరం స్థానిక మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో ప్రబలుతున్న సీజనల్ జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరాల బారిన పడి ఆస్పత్రులో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు
రాష్ట్రంలో జ్వరాల పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో సీజనల్ వ్యాధులపై ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే జ్వరాలను అరికట్టేందుకు ఆశావర్కర్లు ఇస్తున్న సూచనలు జనాలు పాటించాలని ఈ సందర్భంగా ఈటల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చర్యలతో పాటు జనాలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఈటల సూచించారు.