సూర్యాపేట: బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని రక్షించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ముందుకు వచ్చారు. సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వల్ధాసు ఉపేందర్‌ ఎనిమిది సంవత్సరాల కూతురు భూమిక అనారోగ్యంతో బాధపడుతుండగా ఇటీవల హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆ చిన్నారి బ్రెయిన్‌ ట్యూమర్‌‌తో బాధపడుతున్నట్టు డాక్టర్లు.. వైద్య ఖర్చులకు రూ.8 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైలర్‌ వృత్తే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు.. తమ బిడ్డకు వచ్చి కష్టాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు అంత మొత్తంలో డబ్బు ఎక్కడినుంచి వస్తుందని తీవ్ర ఆవేదనకు గురవుతున్న సమయంలోనే సూర్యాపేటకు చెందిన వారి మిత్రుడు శైలేంద్రా చారి పాప పరిస్థితిని ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌కు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. చిన్నారిని తప్పకుండా ఆదుకుంటామన్నట్టుగా బదులిచ్చారు. కేటీఆర్ స్పందించిన తీరుతో చిన్నారి తల్లిదండ్రుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.

ఇక ఇదే తరహాలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మరో 8 ఏళ్ల చిన్నారికి సైతం ఇప్పటికే రూ. 2 లక్షల వరకు ఖర్చయ్యాయని, మరో రూ15 లక్షల వరకు అవసరమని కేటీఆర్ సహాయం కోరుతూ ఫనిందర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కి సైతం కేటీఆర్ స్పందించారు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్స్‌ని సంప్రదించి అండగా నిలవాల్సిందిగా కేటీఆర్ తన సిబ్బంది సూచించారు.