KTR Khammam Visit: మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా... కారణమిదే...!
KTR Khammam Tour Postponed: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.
KTR Khammam Tour Postponed: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. సోమవారం (ఏప్రిల్ 18) కేటీఆర్ ఖమ్మంలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు ఈ-కామర్స్ అంశంపై పార్లమెంటరీ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమం ఉండటంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా వెనుక రాజకీయ కారణాలున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.
ఖమ్మంకు చెందిన సాయి గణేశ్ అనే బీజేపీ నేత ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గణేశ్ ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయే కారణమని.. అతనిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాయి గణేశ్ మృతదేహంతో శనివారం (ఏప్రిల్ 16) ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. దీంతో ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే సాయి గణేశ్ మరణ వాంగ్మూలం నమోదు చేయలేదని ఆరోపించారు. తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాయి గణేశ్ మృతికి కారణమైన సీఎం, సంబంధిత పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మరోవైపు, సాయి గణేశ్ ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి పువ్వాడ అజయ్‌పై చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడే సాయి గణేశ్‌ను రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రోత్సహించాడని ఆరోపిస్తున్నారు. రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నీచపు విధానాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇలా టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఖమ్మంలో హైటెన్షన్ పాలిటిక్స్ నడుస్తుండటంతో కేటీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Prashant kishor: పీకేతో పరేషాన్.. రేవంత్ రెడ్డి శిబిరంలో టెన్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook