Minister Sathyavathi Rathod Convoy: రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌‌లోని ఒక ఎస్కార్ట్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆ కార్యక్రమాలు ముగించుకుని హైదరాబాద్‌కి తిరిగి వెళ్తుండగా కాన్వాయ్ లోని వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ తాడ్వాయి సమీపంలోకి రాగానే.. అనుకోకుండా కాన్వాయ్ కి ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం కాన్వాయ్ లోని మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం పాక్షికంగా దెబ్బతిందని... అదృష్టవశాత్తుగా ఆ వాహనంలో ఉన్న గన్‌మెన్లకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ లోని వాహనం ప్రమాదం బారినపడటంతో మంత్రి సత్యవతి రాథోడ్ సహా వెంట ఉన్న సిబ్బంది అంతా తొలుత టెన్షన్ పడినప్పటికీ.. ఆ వాహనంలో ఉన్న సిబ్బంది క్షేమంగా బయటపడటంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. 


వెంటనే తమ వాహనాల శ్రేణిని ఒక పక్కకు నిలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.. కారు దిగొచ్చి గన్‌మెన్లతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొన్న బొలోరే వాహనదారుడు కూడా సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడటం అందరికీ ఇంకొంత ఊరటనిచ్చింది. పరిస్థితి అంతా పరిశీలించిన అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరింది.