భ‌ద్రాద్రి : శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు నడయాడిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రతీ ఏడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో చెప్పనవసరంలేదు. కానీ ఈసారి కరోనావైరస్ వ్యాపించిన నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పాటించాల్సిందిగా ఆదేశించడంతో భక్తులు ఎవ్వరూ ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం ఏప్రిల్ 2న జరగనున్న శ్రీరామ నవమి వేడుకలను ఎప్పటిలా లక్షలాది భక్తుల మధ్య కాకుండా ఆలయ ప్రాంగణంలోనే అతి కొద్ది మంది అర్చకులు సమక్షంలో నిరాడంబ‌రంగా జరగనుంది. ఇందుకోసం ఆల‌య  అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Flash: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. జిల్లాల వారీగా వివరాలు


శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కోసం భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వేదిక కానుంది. ఆనవాయితీ ప్రకారమే శ్రీ సీతారామచంద్రులకు ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టువ‌స్త్రాలను స‌మ‌ర్పించనున్నారు. ఇప్ప‌టికే మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌ద్ర‌చ‌లం చేరుకోగా దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, క‌లెక్ట‌ర్ ఎం.వి. రెడ్డి, ఆల‌య ఈవో న‌ర్సింహులు మంత్రికి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం క‌ళ్యాణోత్స‌వ ఏర్పాట్ల‌పై మంత్రి అల్లోల‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి అధికారుల‌తో చ‌ర్చించారు. 


Read also : Flash: వైద్య సిబ్బంది, పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్


ఇదిలావుంటే, శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందు కోసమని ప్రజలు ఎవ్వరూ ఆలయాలకు వెళ్లకూడదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై మంత్రి హరీష్ రావు సైతం స్పందిస్తూ... స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షా అని అన్నారు. గురువారం శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకల గురించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారని.. అలాగే శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంతో కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సూచించారు. భక్తులు ఆలయాలకు వెళ్లకూడదని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తిచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..