తెలంగాణ ప్రాంతంలోని నిర్మల్ జిల్లాలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు స్థానిక మసీదుపై రాళ్ళ వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అదే సమయంలో దేవరకోట ఆలయం నుండి శ్రీరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తూ.. గుల్జర్ మార్కెట్ వైపుకి కొందరు హిందువులు రావడం గమనార్హం. అలా మార్కెట్ వైపుకి వచ్చిన హిందువులే ఆ పని చేసుంటారని కొందరు ఆరోపించడంతో.. ఇరు వర్గాలు పరస్పర దూషణలు చేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

  శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన హిందువుల పేరుతో..కొందరు దుండగులు అ పనికి పాల్పడి ఉంటారని పలువురు అధికారులు అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే కేసును నమోదు చేసినట్లు.. ఈ ఘటనకు కారకులైన వారిని వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు


మసీదుపై దుండగులు రాళ్లు విసరడంతో కిటికీలకు సంబంధించిన గాజు అద్దాలు విరిగిపోయాయి. ఎప్పుడైతే మసీదు వద్ద దాడి జరిగిందన్న విషయం బయటకు పొక్కిందో.. గుల్జర్ మార్కెట్ ప్రాంతానికి ఎందరో ముస్లిములు చేరుకున్నారు. కారకులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ..మసీదు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో మసీదు వద్ద పెరుగుతున్న గుంపును కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.


ప్రస్తుతం మసీదుపైకి రాళ్లు విసిరిన వ్యక్తులు ఎవరో కనుక్కొనేందుకు సీసీటీవి ఫుటేజీలను సేకరిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని.. వారిని తప్పకుండా అరెస్టు చేస్తామని చెబుతున్నారు. కరీంనగర్ రేంజ్ డిప్యూటి ఇన్స్‌పెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్
కూడా సంఘటనా స్థలిని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు