KCR BRS Party MLAs: పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పోతేపోనీయి' అని పేర్కొన్నారు. పార్టీని వీడి దొంగల మాదిరి కలిసేవారి గురించి బాధలేదని తెలిపారు. 'తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్క' అని కొట్టిపారేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. 'పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు' అని పేర్కొన్నారు. 'నాడైనా నేడయినా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది' అని కేసీఆర్‌ తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TPCC President: ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్‌ సుదీర్ఘ కసరత్తు.. కొత్త పీసీసీగా అతడికేనా పట్టం?


 


సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కూడా కేసీఆర్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రోజురోజుకూ కేసీఆర్‌ను కలిసేందుకు పెరుగుతున్న ప్రజలతో ఎర్రవల్లి ప్రాంతం సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, సాధారణ ప్రజలతో కలిసిన కేసీఆర్‌ అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు. సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే తదితరులతో కేసీఆర్‌ మాట్లాడారు.

Also Read: Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహం


 


పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేల విషయమై ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం' అని చెప్పారు. 'ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నది' అని స్పష్టం చేశారు. 'సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదు. పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవద్దు' అని పార్టీ శ్రేణులకు సూచించారు. 'ఒకరు పోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటాం' అని పునరుద్ఘాటించారు.


'తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్‌కు మాత్రమే  ఉంది' అని కేసీఆర్ వివరించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి నాయకులతో కూడా కేసీఆర్ సమావేశమై భరోసా ఇచ్చారు.


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 'రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉంది. కొన్ని సార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతి కాదు. మనం ఏ హోదాలో ఉన్నా కానీ ప్రజలకోసం పని చేయాల్సిందే' అని స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter