RS Praveen Kumar Vs Mallu Ravi: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో నాగర్‌కర్నూల్‌ ప్రత్యేకత కలిగి ఉంది. ఎస్సీ నియోజకవర్గమైన ఈ స్థానం నుంచి ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌కు స్థానాలు దక్కగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు స్థానాలు లభించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోతుగంటి రాములు ఎంపీగా గెలిచారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపారు. అయితే ఇక్కడ ఎన్నికలో బీజేపీ పాత్ర నామమాత్రం కనిపిస్తోంది. పోటీ ప్రధానంగా బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండనుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?


ఆర్ఎస్పీ బలం
బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఐపీఎస్‌ మాజీ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బరిలో దిగడంతో నాగర్‌కర్నూల్‌ పోరు ఆసక్తిగా మారింది. ఆయన గురుకులాల కార్యదర్శిగా అద్భుతంగా పనిచేసి వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేశారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీలో ఉన్న ఆయన అనూహ్యంగా గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం వెంటనే బీఆర్‌ఎస్‌ టికెట్‌ పొంది పోటీలో నిలిచారు. ప్రవీణ్‌ కుమార్‌ అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో పార్టీ వర్గాలు సహకరిస్తున్నాయి.

గద్వాల, ఆలంపూర్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఆర్‌ఎస్పీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర భారీ విజయం సాధించింది. గులాబీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ప్రచారం చేశారు. అతడి సామాజికవర్గం అతడికి బలంగా మారే అవకాశం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన విద్యార్థులు కూడా వచ్చి ప్రచారం చేయడం కలిసొచ్చే అంశం. అచ్చంపేటలో గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్ధన్‌ రెడ్డి, వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఎన్నికల్లో ప్రవీణ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. సిట్టింగ్ స్థానం కావడంతో మరోసారి గెలవాలనే పట్టుదలతో గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమించింది.

Also Read: KTR At Charminar: రాజముద్ర మార్పుపై కేటీఆర్‌ ఆందోళన.. చార్మినార్‌ వద్ద నిరసన


మల్లుకు 'ముల్లు'గా మారిన పరిణామాలు
అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల టికెట్‌ ఆశించి భంగపడ్డ సీనియర్‌ నాయకుడు మల్లు రవి తీవ్రంగా పట్టుబట్టి లోక్‌సభ సభ్యత్వాన్ని సాధించారు. దీనికోసం ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం మల్లు రవికి కలిసొచ్చే అంశం. ఐదు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ కూడా బలంగా ఉంది. అయితే లోక్‌సభ నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు పట్టు లేదు. రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి ఈయన నియోజకవర్గ పరిధిలోనే ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ ఎమ్మెల్యేలు మల్లు రవికి మద్దతుగా నామమాత్రంగా పని చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక హామీలు నిలబెట్టుకోకపోవడం, ఫామ్‌హౌజ్‌లో తింటున్న దళితులతో అమానుషంగా ప్రవర్తించడం వంటి అంశాలు మల్లు రవికి ముల్లుగా పరిణమించేలా ఉన్నాయి.


తండ్రి వారసత్వం కలిసొచ్చేనా?
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన పోతుగంటి రాములు అనూహ్యంగా బీజేపీలో చేరారు. తన కుమారుడికి టికెట్‌ నిరాకరించడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం వెంటనే కమలం పార్టీ ఆయన కుమారుడు భరత్‌కు లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. రాములుకు నియోజకవర్గంలో పట్టు లేదు. తండ్రీకొడులకు పెద్ద అనుచవర్గం కూడా లేదు. ఇక్కడ బీజేపీ నామమాత్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కలేదు. ఒక్క కల్వకుర్తి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మూడో స్థానానికి పరిమితమైంది. కేవలం నరేంద్ర మోదీ చరిష్మా, హిందూ ఓట్లను భరత్‌ నమ్ముకుంది. అచ్చంపేటలో కొద్దిమేర రాములు వర్గం ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా చోట్ల భరత్‌కు ఓట్లు పడడం కష్టమే.


తీవ్ర పోటీ గట్టెక్కెదెవరో..?
లోక్‌సభ ఎన్నికల సరళి పరిశీలిస్తే నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పార్టీ ఉందని చెప్పవచ్చు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మల్లు రవి మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉంది. అధికారం ఉండడంతోపాటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలీయంగా ఉండడంతో మల్లు రవి గెలుపునకు దోహదం చేయవచ్చు. అది కాని పక్షంలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉండడం.. బలమైన అభ్యర్థి కావడం.. ఎస్సీ సామాజికవర్గ ఓట్లన్నీ గంపగుత్తగా పడితే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది. ఇక్కడ స్పష్టంగా ఎవరూ గెలుస్తారనే చెప్పడం కష్టంగా ఉంది. ఎవరు గెలిచినా కొద్ది మొత్తంలో మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో జూన్‌ 4వ తేదీ వరకు ఎదురుచూడాలి.


నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్వరూపం
అసెంబ్లీ నియోజకవర్గాలు నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, గద్వాల, ఆలంపూర్‌, కల్వకుర్తి, వనపర్తి,


గత ఎన్నికల్లో గెలిచింది: బీఆర్‌ఎస్‌ పార్టీ
ప్రస్తుత అభ్యర్థులు
బీఆర్‌ఎస్‌ పార్టీ: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
కాంగ్రెస్‌: మల్లు రవి
బీజేపీ: పోతుగంటి భరత్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి