Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?

High Tension On Mahabubnagar Lok Sabha Election Results DK Aruna Or Vamshichand: రాష్ట్రంలో కీలకమైన మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్‌ రెడ్డి పోటీతో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 29, 2024, 12:26 PM IST
Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?

Mahabubnagar Lok Sabha: తెలంగాణలో కీలక లోక్‌సభ స్థానం మహబూబ్‌నగర్‌. ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి నిలబెట్టుకుంటుందా? లేదా అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి లోక్‌సభ బరిలో నిల్చున్న బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణను అదృష్టం వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్‌ చేయడమే మార్పా? కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

రేవంత్ రెడ్డికి చావోరేవో
అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏడింటికి ఏడు స్థానాలు హస్తం పార్టీ గెలుచుకుంది. ఇదే స్థానంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌ కూడా ఉంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుపై పూర్తి ధీమాతో ఉంది. ఇక్కడి నుంచి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌ రెడ్డి పోటీ చేస్తున్నాడు. కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన వంశీచంద్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశాడు. నాడు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు లోక్‌సభకు అవకాశం ఇచ్చింది. ఎంపీగా గెలిచేందుకు వంశీచంద్‌ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గవ్యాప్తంగా వంశీచంద్‌ పాదయాత్ర చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో యాత్ర చేసి తన పట్టు నిలబెట్టుకున్నారు. అతడి పోటీపై ఎలాంటి వివాదం లేకపోవడంతో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ వంశీచంద్‌ రెడ్డికి సహకరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వంశీచంద్‌ రెడ్డి గెలుపు కోసం పని చేశారు.

Also Read: KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఇక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. తన సొంత లోక్‌సభ స్థానం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలోనే దాదాపు 10 సార్లు రేవంత్‌ రెడ్డి ప్రచారం చేయడం చూస్తుంటే ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. అయితే ఇక్కడ గెలుపు వంశీచంద్‌ కన్నా రేవంత్‌ రెడ్డికి అత్యంత అవసరం. ఇక్కడ ఓడిపోతే ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సొంత లోక్‌సభను కోల్పోయాడనే అపప్రద రావొద్దని రేవంత్‌ ఈ స్థానంపై పూర్తి దృష్టి సారించాడు. అధికారంలో ఉండడంతోపాటు రేవంత్‌ రెడ్డి బలం.. వంశీచంద్‌ రెడ్డి వ్యక్తిత్వం.. నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలుపొందడం వంటి వాటితో తాము గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.

సిట్టింగ్‌ నిలబెట్టుకుంటుందా?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. హోరాహోరీ పోరు జరిగినా రెండో స్థానానికి పరిమితమైంది. స్వల్ప ఓట్లతో రెండు, మూడు స్థానాలను చేజార్చుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మరి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈ స్థానంపై గులాబీ పార్టీ ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితమే పునరావృతమవుతుందనే భావనలో ఉంది. అయినా కూడా కారు పార్టీ గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్రకు ఊహించని స్పందన లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఒక్క నాయకుడు కూడా పార్టీ ఫిరాయించలేదు. గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత ప్రతికూలత ఏర్పడింది. గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల నాయకులు సహకరించారు. కానీ అభ్యర్థి ఎంపికనే తప్పు అనే భావనలో ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. వంశీచంద్ రెడ్డి, డీకే అరుణను ఢీకొట్టేంత బలమైన నాయకుడు కాకపోవడంతో గులాబీ శ్రేణులు సిట్టింగ్‌ స్థానం చేజారుతుందనే ఏనాడో ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే పరోక్షంగా డీకే అరుణకు బీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. పాలమూరులో ఈసారి కారు గెలవడమే కష్టంగా కనిపిస్తోంది.

అరుణోదయమా?
అసెంబ్లీ ఎన్నికల్లో స్థాన సొంత స్థానం గద్వాలలో గెలిచే అవకాశం ఉన్నా కూడా డీకే అరుణ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఎప్పటి నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలవాలనే కలగంటున్న డీకే అరుణ ఈసారి తన కల సాధించుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా కూడా లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాషాయ పార్టీ బలం తక్కువగా ఉంది. అయితే అరుణ మాత్రం నరేంద్ర మోదీ చరిష్మా, హిందూయిజం, తన బలాన్ని నమ్ముకున్నారు. మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌, దేవరకద్రలో అరుణకు కొంత పట్టు ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అక్కడ దశాబ్దాల నుంచి పని చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో కీలక నాయకురాలిగా ఉన్న అరుణ ప్రజలందరికీ సుపరిచతమే. గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో అరుణ పని చేశారు. ఆమెకు మద్దతుగా మోదీ, అమిత్‌ షా ప్రచారానికి వచ్చారు. గెలిస్తే అరుణ కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. తన బలాన్ని నమ్ముకున్నా అరుణ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తోంది. హోరాహోరీగా జరిగే పోటీలో వంశీపై అరుణ పైచేయి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

గెలుపు వీరిదే?
మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ ఉందని పోలింగ్‌ సరళి చూస్తే తెలుస్తోంది. ఇద్దరు బలమైన అభ్యర్థులకు తోడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, మోదీ చరిష్మా, హిందూయిజం డీకే అరుణకు ఓట్లు కురిపించే అవకాశం ఉంది. ఇక వంశీచంద్‌కు తన వ్యక్తిత్వంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ వంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వారిద్దరిలో చెప్పుకోవడానికి పెద్దగా లోపాలు ఏమీ లేకపోవడంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో రాష్ట్ర రాజకీయాలే ప్రభావవంతంగా పని చేస్తాయని చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే వంశీచంద్‌ రెడ్డి ఎంపీగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News