Girl's Complaint Against Her Drunkard Father: మద్యం తాగొచ్చి రోజూ మా అమ్మను.. నన్ను కొడుతున్న మా నాన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నన్ను, మా అమ్మని కాపాడండి అంకుల్ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన చిట్టిచిట్టి మాటలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికులు వెల్లడించిన కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన 9 సంవత్సరాల శిరిన్ ఫాతిమా స్థానిక పాఠశాలలోనే 4వ తరగతి చదువుతోంది. ఫాతిమా తండ్రి లతీఫ్ మద్యానికి బానిసయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం అలవాటుగా బానిసైన లతీఫ్.. రోజూ ఫూటుగా మద్యం తాగిరావడమే కాకుండా తన భార్య గౌసియా, బిడ్డ శిరీన్ ఫాతిమాలను కొట్టి, హింసిస్తున్నాడు. తన తండ్రి లతీఫ్ రోజు మద్యం తాగి వచ్చి పెడుతున్నవేధింపులను తాళలేకపోయిన ఆ చిన్నారి.. చివరికి ధైర్యం చేసి తన వయసుకు మించిన నిర్ణయమే తీసుకుంది. తనను, తన తల్లి గౌసియను రోజు కొడుతున్న తన తండ్రి లతీఫ్ బారి నుంచి తమను కాపాడండి అంకుల్ అంటూ బీర్కుర్ పోలీస్టేషన్ కి వెళ్లి తండ్రి లతీఫ్ పై రోదిస్తూ ఫిర్యాదు చేసింది.


ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇంట్లో ఉంటామని చెప్పిన ఫాతిమా.. తాను ఇంట్లో ఉండి చదువుకోలేనని.. తన తండ్రి లతీఫ్ నిత్యం తాగొచ్చి తమను కొడుతున్నాడని చెప్పుకున్న తీరు చూస్తే ఎవరికైనా గుండెలు తరుక్కుపోవాల్సిందే. తనని ఎక్కడైనా హాస్టల్లో చేర్పిస్తే.. తాను అక్కడే ఉండి చదువుకుంటానని.. ఇంట్లో ఉంటే తండ్రి కొడతాడని భయభయంగా ఫాతిమా చెప్పిన తీరు చూపరులకైనా కంటతడి పెట్టించేలా ఉంది. 


తన తల్లి గౌసియా లేకుంటే తన తండ్రి లతీఫ్ తనను చంపేస్తాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి కూడా లతీఫ్ మద్యం తాగి వచ్చి తన భార్యను విపరీతంగా కొట్టడం వల్లే లతీఫ్ కూతురు ఫాతిమా శుక్రవారం బీర్కూర్ పోలీసు స్టేషన్‌కి వచ్చి "మా అమ్మను కాపాడండి అంకుల్" అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. చిన్నారి ఫాతిమా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. లతీఫ్ ని పోలీసు స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకనైనా భార్య గౌసియాను, కూతురు ఫాతిమాను కంటికి రెప్పలా కాపాడుకోకపోతే.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని బీర్కూర్ పోలీసులు లతీఫ్‌ని మందలించి పంపించారు.