TELANGANA BJP: కామారెడ్డి జిల్లాలో కమలం కష్టాలు!
TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ మంచి ఊపుమీదుంది..! అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గతంలో లేనన్నీ సీట్లు దక్కాయి..! త్వరలోనే రాష్ట్రానికి కొత్త బీజేపీ చీఫ్ కూడా రాబోతున్నారు. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం కమలం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు వెనుకాడతున్నారు..! అంతేకాదు పార్టీ బాధ్యతలు స్వీకరించాలంటే కండీషన్లు సైతం పెడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా నేతలు..!
KISHAN REDDY: తెలంగాణలో కమలం వికాసం కోసం కాషాయం పెద్దలు శరవేగంగా పావులు కదుపుతున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్‌గా కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం కూడా జరగబోతోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. సత్తా చాటాలని పార్టీ పెద్దలు కూడా నేతలను పురామయిస్తున్నారు. కానీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్లారెడ్డి బీజేపీ ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు నేతలు కొత్తకొత్త కండీషన్లు పెడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కమలం పార్టీ ఎదురీదుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇంచార్జ్ లేకుండా పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పోటీ చేశారు. కానీ అక్కడ లోకల్ క్యాడర్ గ్రూపులుగా విడిపోవడంతో ఆయనకు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ హవాకు సుభాష్ రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయితే తన ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమని ఆలస్యంగా గుర్తించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జంప్ అయ్యారు. ఆయన పార్టీ మార్పుతో నియోజకవర్గంలో కమలం పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోయాయనే చర్చ జోరుగా సాగుతోంది.
గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెద్దదిక్కులా ఏనుగు రవీందర్ రెడ్డి కొన్నాళ్లు ఉన్నారు. అప్పట్లో ఈటెల రాజేందర్ సహకారంతో ఎల్లారెడ్డి రాజకీయాలను ఏనుగు రవీందర్ రెడ్డి శాసించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఏనుగు కాస్తా బాన్సువాడకు షిప్ట్ అయ్యారు. దాంతో పార్టీని పట్టించుకునే లీడరే కరువయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా లేని రీతిలో 17 మంది లీడర్లు సీటు కోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం మాత్రం ఇంచార్జ్ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఒకరిద్దరూ నేతలు ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్న కొత్తకొత్త కండీషన్లు పెడుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఎల్లారెడ్డి బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ సైతం పెడుతున్నారట. అంతేకాదు.. తన అనుచరులకే పదవులన్నీ దక్కాలనే నిబంధనలు సైతం విధిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా కామారెడ్డి జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. వలస నేతలకు పదవులు ఇవ్వడంతోనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇంచార్జ్ పదవి ఇస్తేగిస్తే.. పార్టీని నమ్ముకుని తొలినుంచి కొనసాగుతున్న వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అంతలోపే ఓ సీనియర్ నేతకు ఇంచార్జ్ పదవి ఇస్తే.. కమల వికాసం మెండుగా ఉంటుందని సూచిస్తున్నారట. చూడాలి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గం విషయంలో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!
Also Read: వైజాగ్స్ దమ్ టీ స్టాల్ లో హోం మంత్రి సందడి
Also Read: RK ROJA: చంద్రబాబు దెబ్బకు రోజా ఖతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.