హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం చేపట్టదల్చిన ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ అఖిలపక్ష నేతలు సిటీ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ని కలిశారు. అయితే, అందుకు అనుమతి నిరాకరించిన సీపీ.. నగరంలో నిరసన ర్యాలీలు చేపట్టేందుకు ససేమిరా వీల్లేదని తెల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీకి పిలుపునివ్వడంతో అంతకంటే ముందుగానే పోలీసులు పలువురు కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు.


నిర్వహించి తీరుతాం: అశ్వత్థామ రెడ్డి
కార్మిక సంఘాల నేతల అరెస్టులపై స్పందించిన ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి... 'కార్మిక సంఘాల నేతలు, కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు' అని మండిపడ్డారు. శనివారం ర్యాలీ నిర్వహించి తీరుతామని, తమను ఎవ్వరూ అడ్డుకోలేరని అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు నేటి రాత్రికే నగరానికి చేరుకుని రేపటి శనివారం జరిగే ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆయన మరోమారు కార్మికులకు పిలుపునిచ్చారు. హయత్ నగర్ లో జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.