సాహితీ `శివుడి`కి కబీర్ సమ్మానం
తెలుగు సాహిత్యంలో గుర్తుపెట్టుకోదగ్గ కవుల్లో కె.శివారెడ్డి కూడా ఒకరు. ఈ రోజే ఆయన్ను కేంద్రప్రభుత్వం కబీర్ సమ్మాన్ పురస్కారంతో సన్మానించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన పురస్కార కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్, శివారెడ్డిని "కబీర్ సమ్మాన్" పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ కబీర్ గొప్ప ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదనీ, మంచి సంస్కర్త అని తెలిపారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి సాహితీ సృజన చేసిన కబీరు పేరు మీద 'రాష్ట్రీయ కబీర్ సమ్మాన్'ను స్థాపించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరానికి గాను కబీర్ సమ్మన్ అవార్డు పొందిన కె.శివారెడ్డి తెలుగు వచన కవిత్వంలో విశేష కృషి చేశారు. గుంటూరు జిల్లా లోని కార్మూరివారిపాలెం గ్రామంలో జన్మించిన ఆయన హైదరాబాదులోని వివేకవర్థిని కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి 1999లో పదవీ విరమణ చేశారు. రక్తం సూర్యుడు, ఆసుపత్రి గీతం, ఆమె ఎవరైతే మాత్రం, నేత్ర ధనస్సు, అంతర్జనం,భారమితి,అతను చరిత్ర ఈయన రాసిన పలు రచనలు. 1990లో మోహనా! ఓ మోహనా! కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు శివారెడ్డి.