సంగారెడ్డి : ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆరంజ్ ట్రావెల్స్ బస్సు... నగర శివార్లలోని రామచంద్రాపురంలొని నాగులమ్మ గుడి వద్దకు చేరుకోగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరెంజ్ ట్రావెల్స్‌కి చెందిన TS08U H3403 నెంబర్ కలిగిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తుగా అందులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకునేటప్పటికే.. బస్సు మంటల్లో కాలిబూడిదైపోయింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన బస్సు.. ఇంకో గంటసేపట్లో గమ్యానికి చేరుకుంటుందనగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణీకుల సామాన్లు బస్సులోనే తగలబడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆరెంజ్ ట్రావెల్స్‌కి అనిల్ రెడ్డి అనే డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం జరిగిన తీరు చూసి ప్రయాణికులు నిలువునా వణికిపోయారు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాం కానీ లేదంటే తమ పరిస్థితి ఏమై ఉండేదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదం పగటి పూట జరిగింది కనుక ప్రయాణికులు అందరూ మెళకువతో ఉన్నారని.. అందువల్లే ప్రాణనష్టం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. లేదంటే ప్రయాణికులు నిద్రిస్తున్న వేళ ఈ ప్రమాదం జరిగి ఉంటే.. ప్రమాదం మిగిల్చే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమేనని అన్నారు. మరోవైపు బస్సు ప్రమాదానికి గురైన చోటే అతి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ప్రమాదం తీవ్రత పెరిగే ప్రమాదం ఏమైనా ఉంటుందేమోనని స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..