OU CI Rajender Over Action: జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌పై దౌర్జన్యానికి పాల్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓ కేసు విషయమై మాట్లాడుదామని ఓ యువకుడిని పిలిచి స్టేషన్‌లో బూతులతో విరుచుకుపడి.. విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అతడి తీరుపై బాధితుడితోపాటు అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యవహార శైలిపై పోలీస్‌ శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడు చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. అయితే నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన సీఐ రాజేందర్‌ తీరుతో పోలీస్ శాఖకు మచ్చ వస్తోంది. తాజాగా యువకుడిపై దాడి చేసిన ఘటనతో పోలీస్‌ శాఖకు తలనొప్పిగా మారింది. బాధితులు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: మనం వైఎస్సార్‌, చంద్రబాబుతో కొట్లాడినం.. చిట్టి నాయుడు ఎంత?


ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న తార్నాకలో సందీప్‌ రెడ్డి గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నాడు. ఓ కేసు విషయమై మాట్లాడాలని సందీప్ రెడ్డికి గురువారం పోలీసులు ఫోన్‌ చేసి పిలిచారు. అయితే తన భార్య గర్భిణి కావడంతో ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి మళ్లీ వస్తామని చెప్పడంతో పోలీసులు ససేమిరా అన్నారు. ఇప్పుడే రావాలని చెప్పడంతో ఆమెను ఇంటిలో దించి బయటకు రాగా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. సొంత కారులో వస్తామంటే అంగీకరించకుండా పోలీస్‌ వ్యాన్‌లో తీసుకొచ్చారు.

Also Read: Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డి


తీరా పోలీస్‌స్టేషన్‌కు వచ్చాక సీఐ రాజేందర్‌ అనుచితంగా వ్యవహరించారని సందీప్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు లేకుండా స్టేషన్‌కు పిలవడంపై ప్రశ్నిస్తే దాడి చేశాడంటూ సందీప్‌ వాపోయారు. 'ఎలాంటి నోటీసు లేకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని అడిగా. స్టేషన్‌కు వచ్చాక సీఐ చాలా అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగినందుకు నాపై దాడి చేశారు' అని వివరించారు.


'స్టేషన్‌లో 15 మంది పోలీసులు కలిసి ఇష్టారీతిన నన్ను, నా తమ్ముళ్లు ఇద్దరిని కొట్టారు. ఎందుకు తీసుకొచ్చారని అడిగితే కారణం చెప్పలేదు' అని సందీప్‌ వెల్లడించారు. 'దాడి విషయాన్ని బయటకు వెల్లడించగా తమపైనే దాడి చేశారని పోలీసులు కట్టుకథ అల్లారు. చివరకు జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం పోలీసులు తప్పయింది అని చెప్పి మళ్లీ ఇంటికి పంపిస్తున్నారు' అని సందీప్‌ రెడ్డి తెలిపారు.


'అసలు నాపై ఎలాంటి ఫిర్యాదు రాకుండానే పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టారు. నన్ను కొట్టిన పోలీసులపై అడిషనల్ డీసీపీ నరసయ్యకు ఫిర్యాదు చేశా. వాళ్లపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను' అని సందీప్‌ రెడ్డి వివరించారు. ఈ వివాదం బయటకు రాకుండా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓ ఉన్నతాధికారి బాధితులకు క్షమాపణ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే తీవ్రంగా దాడి చేయడంతో బాధితుల బట్టలు చిరిగిపోయాయి. అంతేకాకుండా వారి శరీరంపై వాపు.. ఎర్రగా కందిపోవడం వంటివి జరిగాయి. తమకు జరిగిన దాడిపై బాధితులు ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మానవ హక్కుల సంఘం, పోలీస్‌ ఉన్నతాధికారుల వరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సీఐపై చర్యలు తీసుకునే దాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.


రాజేందర్ నిత్యం వివాదాలు
ఓయూ సీఐగా ఉన్న రాజేందర్‌ వ్యవహార శైలి పోలీస్‌ శాఖకు తలనొప్పిగా మారింది. గతంలో అతడి వలన పోలీస్‌ శాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌పై దాడితో అతడి వ్యవహారంపై పోలీస్‌ శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నాటి నుంచి అతడు తీరు మార్చుకోకపోవడంతో స్టేషన్‌కు వచ్చే బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ స్టేషన్‌ పరిధిలో న్యాయం దక్కే అవకాశాలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వివాదాలతో శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్న సీఐ రాజేందర్‌పై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter