Palair MLA Ticket: ఎమ్మెల్యేను తెగ టెన్షన్ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ టికెట్
Palair MLA Kandala Upender Reddy MLA Ticket: రాజకీయాల పరంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితేం బాగోలేదు. రాబోయే ఎన్నికల్లో తనకు పాలేరు నుంచి బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందా లేదా అనే టెన్షన్ కందాలను వేధిస్తోంది. అందుకు కారణాలు ఏంటనేది ఈ విశ్లేషణాత్మక కథనం చూస్తే పాలేరులో నడుస్తోన్న ట్రయాంగిల్ ఫైట్ ఏంటో మీకే అర్థం అవుతుంది.
Palair MLA Kandala Upender Reddy MLA Ticket: బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఖమ్మం జిల్లాలో ఆ ఎమ్మెల్యేకు మాత్రం నమ్మకం కుదరడం లేదట. ఆయనకే కాదు.. ఆయన అనుచరులు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు సైతం ఈ విషయంలో అయోమయంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పొత్తులో భాగంగా కమ్యూనిస్టులు కూడా ఈ సీటుగా గట్టిగా ఆశిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతగా, ఒక సామజిక వర్గంలో పట్టున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం ఇదే అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోసం తన ప్రయత్నాలు తాను చేయడంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ రసకందాయంలో పడిందనే టాక్ వినిపిస్తోంది.
గత ఎన్నికలలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి, మారిన రాజకీయ పరిస్థితులలో ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీలో తుమ్మల నాగేశ్వర రావు, కందాల ఉపేందర్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి అనేక వివాదాలు, ఆధిపత్య పోరు కొనసాగాయి. ఒక దశలో ఇరువర్గాల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం కేసీఆర్, తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా తుమ్మలను ఏమీ అనలేని పరిస్థితులు కనిపించాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల నియోజకవర్గంలో కొంతకాలం సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు తుమ్మల పాలేరులో యాక్టివ్‌గా ఉంటున్నారు. మరోమారు పాలేరులో తుమ్మల బరిలో ఉంటాడని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. తుమ్మల ప్రచారాలను ఎమ్మెల్యే కందాల వర్గీయులు తిప్పికొడుతున్నారు. పాలేరు బరిలో కందాల అంటూ ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
తుమ్మల విషయం అటుంచితే.. కందాల ఉపేందర్ రెడ్డికి కమ్యూనిస్టులతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. మునుగోడు ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓట్లతో బయటపడ్డ బీఆర్ఎస్, వారితో పొత్తు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అనేక సందర్భాలలో ప్రకటించారు. అయితే పొత్తులో బాగంగా పాలేరు సీటును సీపీఎం ఆశిస్తోంది. ఆపార్టీ సభా వేధికలపై రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కమ్యూనిస్టులపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. ఈసారి ఎలాగైనా పాలేరులో పోటీ చేసేలా ప్రధానంగా సీపీఎం పావులు కదుపుతోంది. అందుకు గ్రామీణ స్థాయిలో ఆపార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. అటు తుమ్మల నాగేశ్వర్ రావు, ఇటు కమ్యూనిస్టులు పాలేరు సీటుపై ధీమా వ్యక్తం చేయడంతో కందాల ఉపేందర్ రెడ్డి ఆశలు సన్నగిల్లినట్లు సమాచారం. పైకి బీఆర్ఎస్ నుండి తానే బరిలో ఉంటానని చెబుతున్నప్పటికీ.. లోలోపల పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు.
కమ్యూస్టులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులు కూడా దండిగానే ఉన్నాయి. పాలేరులో ఆపార్టీ నిర్వహించిన సభలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకరించారు. స్వయంగా సభలకు ఆయన కూడా హాజరయ్యారు. పార్టీలో కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా ఎవరూ నిలబడకపోవడం, ఎమ్మెల్యేకు రుచించడం లేదట. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు ఒక్కడే పాలేరులో పోటీచేసేది కందాల ఉపేందర్ రెడ్డి అని ఒకటి, రెండు సందర్బాలలో ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అవడం కందాల టికెట్ ఆశలకు గండిపడినట్టేననే విధంగా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పార్టీ అధిష్టానం హెచ్చరికల నేపథ్యంలోనే తాత మధు కూడా సైలెంట్ అయ్యారని ప్రచారం నడుస్తోంది.
ఇది కూడా చదవండి : Priyanka Gandhi Speech: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. హామీలు నెరవేర్చకపోతే మీరే సర్కారును కూల్చేయండి
ఏదేఏమైనా పాలేరులో పోటీ చేస్తానని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. ఒకవేళ పార్టీ నుండి టికెట్ రాకుంటే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శిబిరం వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం కూడా నడుస్తోంది. పార్టీలో తనకు జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరీశీలిస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : Revanth Reddy Election Promises: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK