MLC Patnam Mahender Reddy takes oath as minister: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈటల రాజేందర్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్టీలోంచి బయటకి పంపించేసిన తరువాత అప్పటి వరకు ఈటల రాజేందర్ నిర్వర్తించిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకి అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈటల రాజేందర్ స్థానంలోకి కేబినెట్ లోకి మరెవ్వరినీ తీసుకోలేదు. ఈటల రాజేందర్ స్థానంలో కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం చూస్తోంటే.. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్నప్పటికీ అందులో ఇంకా స్పష్టత లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన తొలి కేబినెట్ లో పట్నం మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 వరకు మంత్రిగా కొనసాగిన పట్నం మహేందర్ రెడ్డి.. 2019 లో జరిగిన ఎన్నికల్లో తాండూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఎమ్మెల్సీ అయ్యారు. 


తొలి కేబినెట్లో మంత్రికి రెండోసారి అపాయిట్మెంట్ కూడా కరువు ?
ఇదిలావుంటే, 1994, 1998, 2009, 2014 ఎన్నికల్లో తాండూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయాకా తాండూరు నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల బాటలోనే పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో అప్పటి వరకు తాండూరులో మంత్రిగా, బీఆర్ఎస్ నేతగా హవా నడిపించిన పట్నం మహేందర్ రెడ్డికి, పైలట్ రోహిత్ రెడ్డికి మధ్య పార్టీలోనే అంతర్గత పోరు మొదలైంది. అప్పటి వరకు ఎదురెదురు పార్టీల్లో ఉండి పోటీపడిన నేతలు.. ఆ తరువాతి నుండి బీఆర్ఎస్ పార్టీలోనే ఆధిపత్యం కోసం పోరు నడిచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ లోంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. పట్నం మహేందర్ రెడ్డిని దూరం పెడుతూ కొంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ కూడా వినిపించింది. ఒకానొక దశలో పట్నం మహేందర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా కేసీఆర్ ని కలిసేందుకు అపాయిట్మెంట్ కూడా ఇవ్వడంలేదనే కూడా వార్తలొచ్చాయి. 


తాండూరు టికెట్ కోసం పైలట్ vs పట్నం నడిచిన పోరు
ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవు అన్న సామెత చందంగా.. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకి, పట్నం మహేందర్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు నడవడం.. వివిధ సందర్భాల్లో ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి పబ్లిగ్గానే బాహాబాహీలకు దిగడం కూడా జరిగిపోయాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే బీఆర్ఎస్ టికెట్ వస్తుందంటే.. తనకే వస్తుందంటూ ఇద్దరూ నేతలు ధీమా వ్యక్తంచేస్తూ వచ్చారు. 


పట్నం మహేందర్ రెడ్డి తలుపు తట్టిన పైలట్ రోహిత్ రెడ్డి
ఐతే, కాంగ్రెస్ నుండి వచ్చిన అందరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిన తరహాలోనే తాండూరులోనూ గులాభీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికే ఇచ్చారు. అంతేకాకుండా పట్నం మహేందర్ రెడ్డితో విభేదాలు పెట్టుకోకుండా కలిసి పనిచేసుకోవాల్సిందిగా సూచించారు. పట్నం మహేందర్ రెడ్డిని సైతం బుజ్జగిస్తూ అదే సూచనలు చేసినట్టు సమాచారం. దీంతో అప్పటి వరకు ఉన్న విభేదాలు పక్కనపెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి .. పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం, పట్నం సైతం పైలట్ రోహిత్ రెడ్డిని సాదరంగా రిసీవ్ చేసుకోవడం జరిగిపోయాయి.


ఇది కూడా చదవండి : Revanth Reddy: ఆ ఎమ్మెల్యే చచ్చిన శవాన్ని కూడా వదలడు: రేవంత్ రెడ్డి


తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం..
తాజాగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారంతో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇది తాండూరు రాజకీయాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నర్ డా తమిళిసై సౌందర రాజన్ తో ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగా ఉంటూ రాజ్ భవన్‌కి వెళ్లాల్సి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ తను వెళ్లకుండా తన ప్రతినిధిగా ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని లాంటి వారిని పంపిస్తూ వస్తోన్న సీఎం కేసీఆర్.. ఇవాళ పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం అన్నీ పక్కకుపెట్టి వెళ్లకతప్పలేదు. దీంతో ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో ఓ హాట్ టాపిక్ అయింది.


ఇది కూడా చదవండి : Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి