మెట్రో.. ఇక లాంఛనమే
నగరవాసుల ఎదురుచూపులు తీరనున్నాయి... మెట్రో సర్వీసులు లాంఛనంగా ప్రారంభించేందుకు నవంబర్ 28న ముహూర్తం ఖరారయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాదు మెట్రో రైలు పట్టాలపై కూత పెట్టనుంది. ఈ ప్రాజెక్టును మియాపూర్ డిపోలో ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. మెట్రో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ లో దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే..!
మెట్రో హైదరాబాద్ నగరాన్ని 72 కిలోమీటర్లు కవర్ చేసేలా, 64 మెట్రో స్టేషన్లు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే పాతబస్తీలో నిర్మాణం కొన్ని సహేతుక కారణాలతో ఆగిపోయినా, 66 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. ఒకే పిల్లర్ ఆధారంగా స్టేషన్లు, మెట్రో నిర్మాణం జరగటం హైదరాబాద్ మెట్రో విశిష్టత.
మొదటి దశ సర్వీసు
మియాపూర్ నుండి అమీర్ పేట్ - 12 కి.మీ.
నాగోల్ నుండి అమీర్ పేట్ - 18 కి.మీ.
ఈ రెండు మార్గాలలో ప్రతిరోజూ 2లక్షల నుంచి రెండున్నర లక్షల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. అందుకే మొదటి దశలో ఈ రెండు మార్గాలలో మెట్రో రైళ్లు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా ఎటువంటి ఆదేశాలు వెలువడనప్పటికీ టికెట్ ధరలు కనిష్టం రూ.10 నుంచి గరిష్టం రూ. 60 వరకు ఉండవచ్చని అంచనా.
మెట్రో ప్రత్యేకతలు
మెట్రోలో మూడు కోచులు ఉంటాయి. లోకో పైలెట్ (రైలు డ్రైవర్ ను 'లోకో పైలెట్' అంటారు) రహిత టెక్నాలజీ మన మెట్రో సొంతం. అలా అని లోకో పైలెట్ ఉండరు అనుకుంటే పొరబడినట్లే. ప్రతి మెట్రో రైలు ముందు, చివర లోకో పైలెట్ ఒకరు ఉంటారు. కానీ వీరి పని స్టేషన్ రాగానే డోర్లు మూసే, తెరిచే బటన్ నొక్కడమే. మొత్తం రైలు దిశా నిర్దేశం, రాకపోకలు, వేగం తదితర అంశాలను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచే జరుగుతుంది. మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే 57 మెట్రో రైళ్ల నియంత్రణ ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇప్పటికే వంద మందికి పైగా డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చారు. వీరిలో 20 మందికి పైగా మహిళలు కూడా ఉండడం విశేషం.
స్మార్ట్ కార్డు (మెట్రో కార్డు)
స్మార్ట్ కార్డు అనేది మెట్రోలో కీలక విషయం. టైం ఆదా చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఉంటే క్యూ లో నిల్చొని టికెట్/ టోకెన్ తీసుకోవాల్సిన పనిలేదు. సాధారణ టికెట్/ టోకెన్ తో పోలిస్తే స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణిస్తే 15 శాతం రాయితీ లభిస్తుంది. కార్డు మొదటిసారి తీసుకొనేవారు డిపాజిట్ అమౌంట్ కట్టాలి. తరువాత రీచార్జ్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు 200 రూపాయలతో కార్డ్ కొనుగోలు చేయాలని అనుకుంటే.. అందులో 100 రూపాయలు డిపాజిట్ కు, మిగితా వంద రూపాయలు రీఛార్జ్ అవుతుంది. (దిల్లీ లో మెట్రో కార్డు 150 రూపాయలు. 50 రూపాయలు డిపాజిట్, 100 రూపాయలు రీఛార్జ్ అవుతుంది).