Revanth Reddy: ఓఆర్ఆర్‌ను తెగనమ్మేశారు.. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు: రేవంత్ రెడ్డి
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Hyderabad Police Stopped Revanth Reddy: కొత్త సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లగా.. టెలిఫోన్ భవన్ దగ్గర్లోనే పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించగా.. సచివాలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకు సచివాలయంలోకి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తాను ఒక ఎంపీని అని.. తనను అడ్డుకునే హక్కు లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని.. హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. తాను ఒక్కడినే వస్తానని.. పోలీసు వాహనంలోనే తనను లోపలకు తీసుకువెళ్లాలని కోరగా.. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయాలనుకుంటున్న డిపార్ట్‌మెంట్ కొత్త భవనంలో లేదని పోలీసులు చెప్పారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను నిర్మించిందని అన్నారు. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని.. అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించిందన్నారు. రూ.6,696 కోట్లు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని.. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసిందన్నారు.
'ప్రతీ ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్ల టోల్ ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్‌ను ముంబై సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. రూ.7,388 కోట్లకు ఐఆర్‌బీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఏడాదికి రూ.750 కోట్లు వస్తుంటే.. రూ.246 కోట్లకే ముంబై కంపెనీకి ఇచ్చింది. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్‌ను తెగనమ్మారు. ఆరు నెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్ముకున్నారు. నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24 గంటలు తిరక్కముందే మరిచారు.
గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్‌కు సంబంధించి టేబుడర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లా.. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్ నాలెడ్జిపై రబ్బరు స్టాంప్ కూడా వేయలేదు. సెక్రటేరియట్‌కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు. అరవింద్ కుమార్ ఇక్కడ లేడు.. అక్కడ లేడు.. మరి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నాడా..?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను అమ్ముకున్నారని.. ఇది వేల కోట్ల కుంభకోణం అని ఆరోపించారు. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారని.. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదన్నారు. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని.. న్యాయస్థానాల తలుపు తడతామన్నారు. కేటీఆర్‌ను జైల్లో పెట్టే వరకు పోరాడుతామని.. బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. పరిపాలన భవనంలోకి ఎంపీకి అనుమతి ఎందుకు అని.. కిలోమీటర్ దూరంలోనే తనను అడ్డుకున్నారని అన్నారు. కనీసం గేటు వరకు కూడా రానివ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తామని.. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook