ATTAK ON MALLAREDDY: తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కులాల చుట్టే తిరుగుతున్నాయి. రెడ్డి సంఘం సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. రెడ్ల రాజకీయం గురించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన వ్యతిరేకత వచ్చింది. ఆ వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా మరో ఘటన జరిగింది. రెడ్డి సింహగర్జన సభకు వెళ్లిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడం.. దాడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయి. ఇటీవల కాలంలో ముదిరిపోయాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరగడం రాజకీయంగా సంచలనంగా మారింది. మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు.. ఎందుకు చేశారు.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక ఆవేశంతోనే అలా చేశారా అన్న చర్చలు సాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో రెడ్డి సింహగర్జన సభ నిర్వహించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెడ్లు వచ్చారు. వివిధ పార్టీల రెడ్డి నాయకులు కూడా హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. సమావేశంలో చివరగా ప్రసంగించారు మల్లారెడ్డి. అయితే కాసేపు రెడ్డి సమస్యలు. జేఏసీ డిమాండ్లపై మాట్లాడిన మల్లారెడ్డి.. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడారు. కేసీఆర్ గొప్పగా పాలిస్తున్నారని.. సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని చెప్పారు. ఇక్కడే గొడవ మొదలైంది. కేసీఆర్ ను కీర్తిస్తూ మల్లారెడ్డి మాట్లాడటంపై సభకు వచ్చిన కార్యకర్తలు వ్యతిరేకించారు. మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.


అయినా ప్రసంగం కొనసాగించిన మల్లారెడ్డి.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని కామెంట్ చేశారు. తాను అబద్దాలు చెప్పనని, లుచ్చా మాటలు మాట్లాడనని చెప్పారు. దీంతో మరింతగా రెచ్చిపోయారు కార్యకర్తలు.  వేదికపై ఉన్న మల్లారెడ్డి వైపు కొందరు కోపంగా దూసుకుపోయారు. కుర్చీలు విసిరేశారు. మల్లారెడ్డిపై కొందరు రాళ్లు కూడా విసిరారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మంత్రిని వేదికపై నుంచి కిందక తీసుకువచ్చారు పోలీసులు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ వెంట కొందరు పరుగులు తీశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. మల్లారెడ్డి కారును చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపించింది. కారును వెంబడించి మరీ దాడికి యత్నించారు. అయితే పోలీసులు మంత్రి కారుకు వలయంగా ఏర్పడి.. మల్లారెడ్డిని సభా స్థలి నుంచి పంపించివేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. మంత్రి మల్లారెడ్డి ఓవరాక్షన్ చేయడం వల్లే సమస్య వచ్చిందని రెడ్డి జేఏసీ నేతలు చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు మాత్రం రేవంత్ రెడ్డి అనుచరులే దాడికి యత్నించారని ఆరోపించారు. మంత్రి ప్రసంగం మొదలు కాగానే కొందరు నినాదాలు చేశారని.. పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని చెబుతున్నారు. 


READ ALSO: PM Cares For Children : పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ప్రయోజనాలేంటీ.. ఎవరికి ఇస్తారు? కేంద్రం చేసే సాయం ఏంటీ?


READ ALSO: TRS Strategy: సీఎం కేసీఆర్ వ్యూహాం మారిందా..ఎన్టీఆర్ రాగం కలిసి వస్తుందా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook