హైదరాబాద్‌: వేసవి వేడి నుంచి అల్లాడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగిస్తూ నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కురిసిన ఈ వర్షానికి హైదరాబాద్‌ జంట నగరాలు తడిసిముద్దయ్యాయి. మధ్యాహ్నం అంతా మండుటెండలతో ఓ మోస్తరు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ సాయంకాలానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 


తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు నగరంలోని సికింద్రాబాద్‌, ఉప్పల్‌, చిలకలగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఉస్మానియా యూనివర్శిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, బేగంపేట, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌ నగర్‌, కోఠి, నాంపల్లి, మెహిదీపట్నం, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆగకుండా కురిసిన వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి.