Revanth Reddy Birthday Special: రేవంత్ రెడ్డి బర్త్‌డే స్పెషల్.. రియల్ లైఫ్ స్టోరీలో ఆసక్తికరమైన అంశాలు
Revanth Reddy Birthday Special: రేవంత్ రెడ్డి.. ఈయన్ను తెలంగాణ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటే అది చాలా సింపుల్ అవుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటే అది రొటీన్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక పొలిటికల్ స్టార్ అని చెప్పుకుంటే అది అచ్చంగా సూట్ అవుతుంది.
Revanth Reddy Real Life story: తలపండిన రాజకీయ నేతలున్న గడ్డపై పుట్టి.. తలపండిన నాయకులున్న పార్టీలో చేరి చేరడంతోనే పిన్న వయస్సులోనే ఆ పెద్ద తలలకే నాయకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్న ఘనుడు రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే అది నిజం. అదే నిజం.. అదే అక్షర సత్యం. అత్యంత జనాధరణ కలిగిన నేత, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పొలిటికల్, పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ లో ఆసక్తికరమైన అంశాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ మేటర్స్
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితమే.. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఎంతమందికి తెలుసంటే అది అతి కొద్దిమందికే తెలుసు. అందుకే ఒకసారి రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969లో నవంబర్ 8న అనుముల నర్సింహా రెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయం నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డికి తోడబుట్టిన వారిలో ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. స్థానికంగా ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్య పూర్తి చేశారు. డిగ్రీ చదువుల కోసం తొలిసారిగా హైదరాబాద్ ముఖం పట్టారు. దోమలగూడ ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా చురుకుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. అక్కడే రాజకీయంగా తొలి అడుగులేశారు. ఆ తరువాత సొంతంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి అన్న కూతురు గీతను ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న రేవంత్ రెడ్డి పాలిటిక్స్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తాను అనుకున్నది సాధించడం కోసం దేన్నయినా, ఎవరినైనా ఎదిరించే మనస్తత్వం ఉన్న మనిషని నిరూపించుకున్నారు.
పెళ్లికి ముందు.. పెళ్లి తరువాత..
పెళ్లికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి.. పెళ్లి తరువాత మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2006 లో మరోసారి మిడ్జిల్ మండల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలనుకున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై విసిగిపోయిన రేవంత్ రెడ్డి.. ఆ రోజుల్లోనే సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా తొలిసారిగా ఒక మండల స్థాయి నాయకుడిగా ఎన్నికయ్యారు.
మండల స్థాయి నుంచి శాసనసభకు..
ఆ తర్వాతు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంట్లోపడ్డారు. అప్పటికే టీడీపీలో తలలు పండిన నాయకులు ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఢీ అంటే ఢీ కొట్టే ఏకైక మొనగాడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే ఆయన చంద్రబాబు కంట్లో పడటానికి కారణమైంది. 2009లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే కొడంగల్ నియోజకవర్గం నుండి బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గుర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. చంద్రబాబు ఇచ్చిన చొరవతో తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు ధీటుగా సమాధానం ఇచ్చే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పొందారు.
టీడీపీని వీడిన సందర్భం..
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమంతో కలిసి రాలేదు. దీంతో అప్పటివరకు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన అగ్ర నేతలంతా తెలంగాణలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని భావిస్తూ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదు. చాలా కాలం ఓపిక పట్టారు. కానీ ఇంకా టీడీపీలో కొనసాగితే రాజకీయంగా ఎదగడం కష్టం అని భావించిన రేవంత్ రెడ్డి ఇక చేసేదేమీ లేని పరిస్థితుల్లో అమరావతి వెళ్లి మర్యాదపూర్వకంగా చంద్రబాబుని కలిసి తన మనసులో మాటను చెప్పారు. తాను టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు సున్నితంగానే విన్నవించుకుని ఆ పార్టీలోంచి బయటికొచ్చేశారు.
కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి అడుగులు
టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. చాలామంది టీడీపీ నేతల్లాగే టీఆర్ఎస్ పార్టీలో చేరుతారా లేక సొంతంగా పార్టీ పెట్టి కేసీఆర్ పై యుద్ధం కొనసాగిస్తారా ? లేక టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ? ఇవే కాకుండా ఇంకెన్నో సందేహాలు జనం మదిని తొలుస్తుండగా వన్ ఫైన్ డే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరడంతోనే దక్కిన ప్రాధాన్యత
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్న రోజులవి. కాంగ్రెస్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ వరుసగా టీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో కేసీఆర్ పై మళ్లీ అదే స్థాయిలో అంతే వాక్చాతుర్యంతో రెచ్చిపోయి ప్రసంగాలు చేసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి ఆయన ఒక ఆశా కిరణంలా కనిపించారు. అందుకే రేవంత్ రెడ్డికి అగ్రతాంబూళం ఇస్తూ వచ్చీ రావడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ టు టీపీసీసీ చీఫ్..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. మునుపటి కంటే మరింత దూకుడుగా రెచ్చిపోయారు. ఒక జాతీయ పార్టీ నాయకుడిగా తన వాగ్ధాటికి మరింత పదును పెట్టారు. తన మాటలనే తూటాలుగా మార్చి టీఆర్ఎస్ పార్టీపైకి ఎక్కుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మునుపటి జోష్ మళ్లీ కనిపించసాగింది. క్రమక్రమంగా పార్టీ ప్రాభవం పెరగసాగింది. నిరాశ, నిస్పృలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆశా కిరణం అయ్యాడు. అదే సమయంలో టీపీపీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త టీపీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ వేట మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంటుగానే నచ్చని కొంతమంది సీనియర్ నేతలు.. ఈసారి టీపీసీసీ చీఫ్ పదవినైనా దక్కించుకోవాలని ఆరాటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు తమనే ఎంపిక చేయబోతుందన్నట్టుగా ప్రకటనలు కూడా ఇచ్చుకుని హడావుడి చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి నేతలు రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మరోసారి రేవంత్ రెడ్డి వాగ్ధాటికే ఓటేస్తూ ఆయనకే టీపీసీసీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పింది.
దేశంలోనే అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గాన్ని గెలిచిన ఘనుడు
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గంగా మల్కాజిగిరి పేరుంది. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలైన రేవంత్ రెడ్డి ఆ తరువాత మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒక అసెంబ్లీ స్థానంలోనే గెలవలేని రేవంత్ రెడ్డి లోక్ సభ స్థానంలో ఏం గెలుస్తాడని గేలి చేశారు. అది కూడా తాను నాన్-లోకల్ అయిన చోట బలమైన లోకల్ ప్రత్యర్థులపై ఎలా విజయం సాధిస్తాడని సూటిపోటి మాటలతో ఆయన ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచి అందరి నోళ్లు మూయించారు.
భగ్గుమన్న అసంతృప్తి..
రెండు, మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ఐదారు పర్యాయాలు అసెంబ్లీకి, పార్లమెంట్ కి ఎంపికవుతూ వచ్చిన తమకే టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించి భంగపడిన నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డి ఎంపికపై నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్.. రేవంత్ రెడ్డిపైనే నమ్మకం పెట్టుకుని ముందుకు సాగడం అతడిపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.
అవకాశం వచ్చిన ప్రతీసారి అడ్డుకుంటున్న వ్యతిరేక శక్తులు..
టీపీసీసీ చీఫ్ పదవి దక్కలేదనే అసంతృప్తితో కొంతమంది నేతలు అవకాశం వచ్చిన ప్రతీసారి రేవంత్ రెడ్డిపై తమ నిరసన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఇంకొంతమంది ఆయనతో కలిసి రాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా సైలెంటుగా ఉండిపోయారు. అందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోతూ పోతూ రేవంత్ రెడ్డిపై తన ఆగ్రహాన్ని వెళ్లిగక్కిపోయారు. రేవంత్ రెడ్డి లాంటి ఎవరో ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం తమకు లేదంటూనే ఢిల్లీలోని బీజేపి పెద్దల కింద పనిచేయడానికి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఏ మాత్రం జంకని రేవంత్ రెడ్డి.. తనతో కలిసి వచ్చే శక్తులతోనే ముందుకు సాగిపోతూ అదృశ్య శక్తులతో ఒక యుద్ధమే చేస్తూ వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అలా రేవంత్ రెడ్డి ప్రతిష్ట మసకబారేందుకు జరిగిన ప్రయత్నాల్లో ఒకటి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి ఎంపిక నుంచి మొదలుపెడితే ఆమె ఓటమి వరకు కొనసాగిన ఎపిసోడ్ అంటారు ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు.
వివాదంలో రేవంత్ రెడ్డి..
ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ పోలీసులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సెబాస్టియన్ అనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఓటును 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండగా రేవంత్ రెడ్డిని పట్టుకున్నట్టు పోలీసులు ఆయనపై అభియోగాలు మోపారు. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. రేవంత్ రెడ్డి బయటికొచ్చారు... రాజకీయంగా ఎదుగుతున్నారు. అలా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏనాడైనా జైలుకు వెళ్లకతప్పదని రేవంత్ రెడ్డి వ్యతిరేక శక్తులు ఎదురుచూస్తున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డికే టీపీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వడం ఆయనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కి ఉన్న నమ్మకం ఏంటో చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని అగ్రస్థాయికి ఎదుగుతారని ఆయన నాయకత్వంలో నడిచే వారి గుండెల్లో బలమైన నమ్మకం నింపడంలో 100 శాతం సక్సెస్ అయిన పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) హ్యాపీ బర్త్ డే విషెస్ అందిస్తోంది జీ తెలుగు న్యూస్.
Also Read : MUNUGODE RESULT: రేవంత్ రెడ్డి అవుట్... కేసీఆర్ కు టెన్షన్! బీజేపీ మునుగోడు ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook