హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణతో పోల్ సమరం ముగిసింది కానీ ఎన్నికల ఫలితాల వెల్లడిపైనే ఇప్పుడు అసలు ఉత్కంఠ నెలకొని వుంది. ఫలితాలు వెల్లడి కాకపోవడంతో కీలక నేతల మధ్య నువ్వా నేనా అనే పోటీ ఇంకా కొనసాగుతూనే వుంది. ఎల్లుండి డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇవాళ టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి మరోసారి సవాల్‌ విసిరారు. కొడంగల్‌ నియోజకవర్గం ఎన్నికల్లో ఓడిపోతే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. అయితే, ఒకవేళ తాను గెలిస్తే సవాల్‌కు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని రేవంత్ ఛాలెంజ్ చేశారు. 


కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను తాను సూటిగా స్వీకరిస్తున్నానని, తాను గెలిచిన మరుక్షణం కేటీఆర్‌ కూడా అదే మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లేనిపక్షంలో మీది(కేటీఆర్) కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి ఉంటుందని రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.