Revanth Reddy Challenges KCR: హైదరాబాద్ : తన గడీని కేవలం తొమ్మిది నెలల కాలంలో కట్టుకున్న కేసీఆర్... నాలుగేళ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయకుండా మధ్యలనే ఆపేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ జరుగుతున్న గూడుపుటాని ఏంటి ? అందులో వేల కోట్ల కథ ఏంటనేది ప్రజలకు తెలియాలని అన్నారు. అహర్నిశలు కష్టపడుతున్న పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసనే కేసీఆర్ కు ఇంపుగా ఉందా అని నిలదీసిన రేవంత్ రెడ్డి.. మళ్లీ చెబుతున్నా.. ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొట్టి తీరుతాం. ఎన్ని వందల కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. కేసులకు భయపడి వెనుకాడే ప్రసక్తే లేదు అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నువు శాశ్వతం అనుకుంటున్న గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏ ప్రగతి భవన్ లోకి అయితే కేసీఆర్ ప్రజలకు ప్రవేశం లేదన్నాడో.. అదే ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తామని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లా వద్ద జనాన్ని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాలకు, మహిళా సంఘాలకు దిక్కులేదు. మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పంట పండించిన రైతులు నానా గోస పడుతున్నారు. పత్తి రైతుల గోస గురించి చెబితే అది ఇంకా వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. గురుకుల టీచర్లకు కూడా చాలీ చాలని జీతాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని వర్గాల ప్రజల గోసకు కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 


డోర్నకల్ నియోజకవర్గంలో స్థానిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగరేసిందని గుర్తుచేసుకున్నారు. రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గానికి నయా జమిందారుగా మారారు. ఇసుక నుంచి గుడుంబా వరకు డోర్నకల్ ఎమ్మెల్యే చేయని దందాలు లేవని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఈ పరిస్థితి రావడానికి కారణం రెడ్యానాయక్ కుటుంబమే అని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ కుటుంబాన్ని ఓడించాలని నియోజకవర్గ ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


నిన్న మహబూబాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించిన తీరుపై స్పందిస్తూ.. కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారని అంటున్నారని.. కేటీఆర్ కాదు కదా.. ఏట్లో రావులందరిని తీసుకొచ్చినా ఏమీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరిపెడ చౌరస్తాలో నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని హెచ్చరించారు. తానేమీ పోలీసులను నమ్ముకుని పాదయాత్ర చేయడం లేదని.. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్ముకుని పాద యాత్ర చేస్తున్నాను అని అన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తోన్న పాపాల భైరవుడైన కేసీఆర్‌ను పాతాళానికి తొక్కేందుకే తాను ఈ యాత్ర చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.


ఇది కూడా చదవండి : Asaduddin Owasi: తాజ్ మహల్ కంటే అందంగా కొత్త సెక్రటేరియట్‌.. లోపల మసీదు నిర్మాణం


ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KTR: నేను రెడి.. నువ్వు రెడినా ? కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook