Kumbham Anil Kumar Reddy: పార్టీని వీడి తప్పు చేశా.. 2 నెలల్లోనే తిరిగి కాంగ్రెస్లో చేరిన కుంభం
Kumbham Anil Kumar Reddy joins Congress party: కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం అనేది అత్యంత సహజం అని lతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లాల్సి రావడంపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Kumbham Anil Kumar Reddy joins Congress party: హైదరాబాద్: ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన భువనగిరి మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. తాజాగా తన సొంతగూటికి చేరారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2018 ఎన్నికల్లో ఓడినప్పటికీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు అని అన్నారు.
పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతీ కార్యక్రమాన్ని అనిల్ కుమార్ రెడ్డి విజయవంతం చేసినట్టు చెప్పిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం అనేది అత్యంత సహజం అని అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లాల్సి రావడంపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. అధిష్టానం ఆదేశాలతో అనిల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాం అని అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటికి చేరినట్టు తెలిపారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తూ భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఈ క్షణం నుంచి భువనగిరి కార్యకర్తలకు అనిల్ రెడ్డి అండగా ఉంటారు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాను గతంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం.. మళ్లీ ఇలా సొంతగూటికి చేరాల్సి రావడంపై కుంభం అనిల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, తాను పార్టీ మారడంతో కార్యకర్తలు మానసికంగా ఇబ్బంది పడ్డారు అని అన్నారు. సరిగ్గా రెండు నెలలు ఆ పార్టీలో ఉన్నానో లేదో... తొందర పడి తప్పుడు నిర్ణయం తీసుకున్నా అని అర్ధమైంది అని పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందని చెబుతూ తనను మళ్లీ పార్టీలోకి రావాలని క్యాడర్ ఒత్తిడి చేశారు అన్నారు. కేసి వేణుగోపాల్ లాంటి నేతలు కూడా తనతో మాట్లాడి తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా తెలిపారు. డైనమిక్ లీడర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం మళ్లి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.