Revanth Reddy: మునుగోడును దత్తత తీసుకుంటా.. కేటీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ?
Revanth Reddy Speech: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ ప్రయోగించిన దత్తత పాచికనే చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రచారం ముగిసే దశలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Revanth Reddy Munugode bypolls Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో నిన్నమొన్నటి వరకు ఎంతో అగ్రెసివ్‌గా కొనసాగిన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార శైలి.. చివరి దశలో సెంటిమెంట్ రాగం ఎత్తుకోవడంతో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి రెడ్డిని గెలిపిస్తే.. తానే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. మొదటి నుంచి స్రవంతిని మునుగోడు ఆడబిడ్డగానే చూపిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చిన సందర్భంలోనూ అదే సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు.
సెంటిమెంట్ అస్త్రం..
" పాల్వాయి స్రవంతిని మునుగోడుకు ఆడబిడ్డగా అభివర్ణించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డను కాదని సంపుకుంటారో... ఆమెను ఈ ఉప ఎన్నికలో ఆదరించి సాదుకుంటారో మీ ఇష్టం అని అన్నారు. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి అరిష్టం అంటారు. ఆడబిడ్డ లాంటి స్రవంతిని కంటతడి పెట్టనీయకండి. నిండు మనసుతో మన ఆడబిడ్డను ఆశీర్వదించి ఈ ఉప ఎన్నికల్లో స్రవంతిని గెలిపించండి" అని మునుగోడు ఓటర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భార్య అయివ స్రవంతి తల్లి ఇక్కడ జరుగుతున్న ఆడబిడ్డల ఆత్మగౌరవ సభకు వచ్చారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోయిన తర్వాత బయటికి రావడానికే ఇష్టపడని ఆమె ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో స్రవంతిని మీ చేతుల్లో పెట్టడానికి బయటికి వచ్చారు. ఇకపై స్రవంతి మీ ఆడబిడ్డ. ఆడబిడ్డను సంపుకుంటారో... సాదుకుంటారో మీ ఇష్టం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
స్రవంతికి మంత్రి పదవి ఆఫర్..
మునుగోడులో స్రవంతి గెలుపుతో ఇకపై చట్టసభల్లో ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందనే విషయంలోనూ రేవంత్ రెడ్డి తన వైఖరిని వెల్లడించారు. స్రవంతిని గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది ఆడబిడ్డలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడబోయే కేబినెట్‌లో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని ప్రకటించారు. ఆ నలుగురిలో స్రవంతి కూడా ఒకరు అని చెప్పి ఆమెకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు స్పష్టచేశారు. అంతేకాకుండా స్రవంతిని గెలిపిస్తే తానే స్వయంగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటా అని తేల్చిచెప్పారు.
రజకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం పుట్టిన గడ్డ..
మునుగోడు నియోజకవర్గానికి ఉన్న చరిత్రను గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. రజకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఇక్కడి ఆడబిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం వంటి వీర వనితలు పుట్టిన గడ్డ ఇది. ఇటువంటి గడ్డ మీద జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో ఇక్కడి ఓటర్లు తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతోంది అని అన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మోసం, రాష్ట్రానికి కేసీఆర్ చేసిన నమ్మక ద్రోహం మీద మీరు తీర్పు ఇవ్వబోతున్నారు అంటూ వారి ఓటు హక్కు విలువను తెలిపే ప్రయత్నం చేశారు.
119 నియోజకవర్గాల జనానికి లేని అవకాశం..
తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఎవ్వరికి రానటువంటి అవకాశం మీకు వచ్చింది. మిమ్మల్ని, మమ్మల్ని, నిరుద్యోగులను, ఉద్యమకారులను, విద్యార్థులను మోసం చేసిన నట్టేటా ముంచి కేసీఆర్ కి ఓటు సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును రాజకీయంగా 100 మీటర్ల లోతులో పాతిపెట్టే అవకాశం మీకు మాత్రమే దక్కింది అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డని ముద్దాడుతున్న బీజేపి..
మునుగోడులో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిన చరిత్రే లేదు అని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుని ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారని బీజేపిని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఆయన్ను ఎంపీగి గెలిపించుకుని, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేగా చేస్తే.. చివరకు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరిండు అని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఎవడి మాటలో పట్టించుకుని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపాలనే కుట్రతో బొడ్డులో కత్తి పెట్టుకొని తిరుగుతుండటం సరికాదని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) హెచ్చరించారు.
Also Read : Stop Line Violations: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
Also Read : Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి
Also Read : Munugodu Bypoll: అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు, 200 కోట్లు దాటిన ఖర్చు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి