Revanth Reddy's Munugode Bypoll Campaign: దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల  భూములను గిరిజనులకు పట్టాలు ఇచ్చి సాగు చేసుకునే భాగ్యం కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. దేశంలో గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసిందని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనుల భూములపై కన్నేశారని కన్నెర్ర చేశారు. కడీల బావి తండాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న గిరిజనులు.. మరీ ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గిరిజనులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిరిజనుల భూములను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుంజుకుని సినిమా వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి గుంజుకునే హక్కు కేసీఆర్ కి ఎక్కడుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ భూములను గుంజుకునేందుకు కేసీఆర్ ఎవరని నిలదీసిన రేవంత్ రెడ్డి.. మీ భూములను అమ్ముకునే హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిందని గుర్తుచేశారు.


కాంగ్రెస్ పార్టీ హక్కులు కల్పిస్తామని చెబుతోంటే.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఆ హక్కులను కాలరాస్తోందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న తేడా ఏంటో గిరిజనులే గ్రహించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఎలాగైతే అడ్డగోలు భూసేకరణ చేశారో.. అలాగే మీ భూములను కూడా గద్దల్లా తన్నుకుపోవాలని సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని.. ఆ కుట్రలను గిరిజనులు తమ ఓటు హక్కు ద్వారా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గిరిజనులకు పిలుపునిచ్చారు.