తెలంగాణ `మందుబాబులకు ` షాకింగ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొద్ది రోజుల్లో మరో గట్టి నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో లిక్కర్ ధరను భారీగా పెంచాలని యోచిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొద్ది రోజుల్లో మరో గట్టి నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో లిక్కర్ ధరను భారీగా పెంచాలని యోచిస్తోంది. వివిధ బ్రాండ్ల లిక్కర్ పై ప్రస్తుతం ఉన్న 3 శాతం ప్రాథమిక ధరలను ఇంకా మూడు రెట్లు పెంచి.. 9 శాతం చేయాలని భావిస్తోందని వినికిడి. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే, ఒక్కో క్వార్టర్ బాటిల్ మీద పది నుండి పాతిక రూపాయల వరకు అదనపు భారం మందుబాబులపై పడే అవకాశం ఉంది.
అయితే బీరు బాటిళ్ళతో పాటు కేసుకు బేస్ ధర రూ.400 కంటే తక్కువ ఉన్న లిక్కర్ బ్రాండ్లకు ఈ కొత్త ధరలు వర్తించవని సమాచారం. 450 క్యాటగరీలోకి వచ్చే లిక్కర్, వైన్‌ల మీద మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ ధరలు తగ్గే అవకాశం లేదని.. 9 శాతం ధర తప్పకుండా పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
గత రెండు సంవత్సరాల నుండి తెలంగాణ లిక్కర్, బీరు పంపిణీ సంఘాలు ధరలు పెంచమని కోరుతున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2015లోనే ఈ ఆలోచన వచ్చినా.. పూర్తిస్థాయి నివేదిక తయారీతో పాటు ధరల మార్పుపై ప్రత్యేక నిబంధనలు రావాలని రాష్ట్రం, అబ్కారీ శాఖను ఆదేశించిన తరుణంలో ఈ నిర్ణయం ఆలస్యమైంది.