2021-22 Academic Year: నిన్నటితో 2021-22 విద్యాసంవత్సరానికి ముగింపు వచ్చింది. సుమారు 18 నెలల విరామం తర్వాత పాఠశాలలు ఎటువంటి కరోనా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బోధిస్తున్న వారికి ఈ సంవత్సరం ఒక ఛాలెంజింగ్‌ గా అనిపించవచ్చు. నా మట్టుకు నేనైతే ఈ సంవత్సరంలో విద్యార్థుల్లో విపరీతమైన క్రమశిక్షణా లోపాన్ని గమనించాను. దీనికి కారణాలు చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకస్మిక బడుల మూత:
మార్చి 2020 సంవత్సరంలో కరోనా పుణ్యమా అని అర్ధాంతరంగా పాఠశాలలు మూసివేశారు. ఆ తరువాత దాదాపు సంవత్సరం పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య డైరెక్ట్‌ సంబంధాలు కొరవడ్డాయి. అనేక మంది కరోనా బారిన పడటం, మానసిక, ఆర్థిక, సామాజిక ఇబ్బందులు విద్యార్థులను ఒక రకమైన విచిత్ర పరిస్థితిలోకి నెట్టివేశాయి. ఆటలు లేవు, దోస్తులు లేరు. ఎవరికి వారు ఇళ్లకు, సెల్లులకు పరిమితం కావడం, విద్యార్థుల మానసిక స్థితిని విపరీతంగా దెబ్బతీసింది. ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో బలవంతంగా విద్యార్థులు సెల్లుఫోన్లకు అంటగట్టబడ్డారు. అది కొంత కాలం తర్వాత వారికి అడిక్షన్‌ గా మారిపోయింది. 


ఆర్థిక పరిస్థితులు:
ఈ 18 నెలల కాలంలో చాలా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. బడులు లేకపోవడంతో ఆర్థిక పరిస్థితుల నుండి కోలుకోవడానికి విద్యార్థులు చిన్న చిన్న పనులకు అలవాటు పడ్డారు (తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది). సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి పనికి వెళ్ళే వారు కూడా ఈ కరోనా కాలంలో నెలకు 5,6 వేలు (ఇంకా ఎక్కువే) సంపాదించగలిగారు. దీని వలన వారికి చదువు పట్ల ఆటోమెటిక్‌గా ఆసక్తి తగ్గిపోయింది. చిన్న వయసులోనే లెక్కకు మించి డబ్బు అందుబాటులో ఉండటంతో వృధా ఖర్చులు చేయడం, పార్టీలు చేసుకోవడం, చెడ్ఢ అలవాట్లకు దగ్గర కావడం జరిగింది. చాలా కుటుంబాల్లో పిల్లలు ఆర్ధికంగా తల్లిదండ్రుల మీద ఆధారపడటం తగ్గిపోయింది. పిల్లల ఖర్చుల విషయంలో తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. 


చదువు మర్చిపోయారు:
రోజు బడికి వస్తేనే చదువు అంతంతమాత్రంగా వస్తున్న రోజుల్లో 18 నెలలు స్కూల్‌ వాతావరణానికి దూరం కావడం చిన్న విషయం కాదు. స్కూల్స్‌ మొదలైన రోజుల్లో ఈ ఇబ్బందిని చాలా ఫేస్‌ చేశాం. పిల్లలందరూ బేసిక్స్‌ మర్చిపోయారు. క్లాసులో కూర్చోవడం అలవాటు తప్పింది. ముఖానికి మాస్కులతో పిల్లలను గుర్తుపట్టడం కూడా సార్లకు ఇబ్బంది అయ్యింది. పాఠం వింటున్నారా లేదా అనేది చాలా వరకు ముఖకవలికలతో తెలుసుకోగలుగుతాం. కానీ ఈ మాస్కుల వల్ల అది కష్టమైంది. అక్షరాలే మర్చిపోయన వారికి పాఠాలేం ఆసక్తినిస్తాయి. చాలా బలవంతంగా క్లాసులో కూర్చొన్న భావన వారి నుండి. ఎన్ని స్కీంలు పెట్టి బేసిక్స్‌ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం 5-10 శాతానికి మించదు. 


సామాజిక పరిస్థితులు:
12-16 సంవత్సరాల వయసు విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది. ఈ వయసులో ఎన్నో రకాల సామాజిక పరిస్థితులకు విద్యార్థి ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టీనేజీలోనే ఉపాధ్యాయుల మోటివేషన్‌ పిల్లలు దారితప్పకుండా చేస్తుంది.  అటువంటి వయసులో ఈ చిన్నపిల్లలు స్కూల్‌ లేని కారణంగా తమకంటే వయసులో పెద్దవారైన యువతతో తిరగడం మూలంగా తమకు తాముగా పెద్దవాళ్ళమనే భావనలోకి వచ్చారు. బైక్‌లపై తిరగడం, దురలవాట్లు నేర్చకోవడం, పెద్దవారిని ఎదిరించడం అలవాటైంది. చాలా స్కూల్స్‌లో పిల్లలకు సార్లంటే భయం/భక్తి పూర్తిగా పోయింది. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఫోన్‌లు అందుబాటులో ఉండటంతో, సినిమాలు, సామాజిక మాధ్యమాల మూలంగా టీనేజ్‌ విద్యార్థుల్లో ప్రేమించడం అనేది తప్పు కాదు అనే భావన మొదలైంది. 6వ తరగతి నుండే ఈ ప్రభావం కనిపిస్తున్నది. విద్యార్థులకు సొంత ఫోన్‌లు ఉండటం, విద్యార్థినీ విద్యార్థుల మధ్య కమ్యునికేషన్‌ పెరగడానికి ప్రధాన కారణం. వివిధ పనుల మూలంగా పిల్లలపై తల్లిదండ్రుల మానిటరింగ్‌ కూడా కొరవడింది.


చేయాల్సిందేమిటి···?
ఇటువంటి పరిస్థితుల్లో ముగిసిన ఈ విద్యాసంవత్సరం చాలా కఠినమైనదిగా భావించడంలో తప్పులేదు. ఈ 9 నెలల కాలంలో ఎంతో కొంత విద్యార్థుల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం ప్రతి ఉపాధ్యాయుడు చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రభావం కొంత మేర వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే విద్యార్థులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫోన్లకు దూరం చేయాలి. ప్రతిరోజు తల్లిదండ్రులు విద్యార్థులతో కొంత సమయం గడపాలి. విద్యార్థులను శారీరక క్రీడలవైపు మళ్లించాలి. వివిధ ప్రోత్సాహకాలనిస్తూ పుస్తకాలు చదివేలా చేయాలి. మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తే తొందరలోనే పాత పాఠశాలలను, ఆ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేసే విద్యార్థులను త్వరలోనే చూడగలుగుతాం అని ఆశిస్తూ....


- గొల్లపెల్లి గణేశ్‌ (తెలుగు పండిట్‌) ధర్మపురి.


Also Read: IPL Venues: ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..ఎక్కడో తెలుసా..?


Also Read: Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్‌.. బయటకు దూకిన ప్రయాణికులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.