ఆదివారం (మార్చి 11న) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలియో చుక్కల కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22,768 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కల మందును వేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 


737 ట్రాన్సిట్‌ కేంద్రాల ద్వారా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.787 మొబైల్‌ టీంలు, 2,280 మంది రూట్‌ సూపర్‌వైజర్స్, 8,711 మంది ఎఎన్‌ఎంలు, 27,045 మంది ఆశా వర్కర్లు, 32,082 మంది అంగన్‌వాడీ వర్కర్లు.. ఇలా మొత్తంగా 95 వేల మందికి పైగా  సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. మార్చి 11న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం వరుసగా రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. అప్పడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.