Singareni Collieries Company Profits: బొగ్గు ఉత్పత్తితో పాటు ధర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తు రంగాలలో కూడా రాణిస్తూ 32 వేల కోట్ల టర్నోవర్, 11,665 కోట్ల డిపాజిట్లు, ఏటా 750 కోట్లకు పైగా వడ్డీ రాబడులు కిలిగి, పూర్తి ఆర్థిక పరిపుష్టితో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కంపెనీని అప్పుల పాలయింది అంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని సింగరేణి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం నాడు ఒక వివరణాత్మక    ప్రకటనను విడుదల చేసింది. బొగ్గు ఉత్పత్తిలోనూ, కార్మికుల సంక్షేమంలోనూ అత్యుత్తమ ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్న సింగరేణి పేరు ప్రతిష్టలను కించపరుస్తూ కొందరు అవాస్తవ, నిరాధార నిందారోపణలు చేయడంపై యాజమాన్యం తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తూ వాస్తవాలను వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ 32వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న సింగరేణి సంస్థ పటిష్టమైన ఆర్థిక పునాదులను ఏర్పరచుకొని ఇతర రాష్ట్రాల్లోకి కూడా విస్తరిస్తూ ఒడిస్సా రాష్ట్రంలో మరో రెండు నెలల్లో తొలిసారిగా బొగ్గు గనిని ప్రారంభించబోతోంది. కంపెనీ వద్ద వివిధ బ్యాంకుల్లో, ఎల్. ఐ .సి లో గల డిపాజిట్లు, బాండ్ల ద్వారా కలిగి ఉన్న సొమ్ము రూ. 11,665 కోట్లు.. తద్వారా కంపెనీ ఏడాదికి సుమారు 750 కోట్ల రూపాయల వడ్డీని కూడా పొందుతోంది. వీటితోపాటు వినియోగదారుల నుంచి రావాల్సి ఉన్న బకాయిలు రూ. 15,500 వేల కోట్లు పైగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం మీద రూ 27 వేల కోట్ల ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్న సింగరేణి కంపెనీ అప్పుల పాలైందని, రూ. 12 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరం.


దేశంలో ఏ ఇతర ప్రభుత్వ సంస్థ కూడా చేపట్టని విధంగా సింగరేణి సంస్థ సుస్థిర ఆర్థిక పునాదుల కోసం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్ కేంద్రాల కోసం చేసిన 472 కోట్ల రూపాయల అప్పును ఇప్పటికే తీర్చివేయగా, థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం చేసిన 5,300 కోట్ల అప్పులో ఇంకా కేవలం 2800 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉంది. అంటే సింగరేణికి ఉన్న అప్పు కేవలం రూ.2800 కోట్లు మాత్రమే. కాగా 12 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పడం హాస్యాస్పదం, అత్యంత బాధాకరం అని యాజమాన్యం పేర్కొంది.
 
కోట్లాది రూపాయల లాభాలు, రాబడులు గల సింగరేణి సంస్థకు కార్మికుల జీతాల చెల్లింపుకు అప్పులు చేయాల్సిన గత్యంతరం ఏమాత్రం లేదు. ప్రతి నెల 3వ తేదీన కచ్చితంగా జీతాల చెల్లింపుతో పాటు, ప్రతి ఏటా పెంచి చెల్లిస్తున్న లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్ లు క్రమం తప్పకుండా కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి టర్నోవర్ లాభాల్లో దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా నిలుస్తూ సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటోంది. తెలంగాణ రాకపూర్వం సగటున ఒక కార్మికునిపై లక్ష 15 వేల రూపాయల సంక్షేమ ఖర్చు వెచ్చించగా ఇప్పుడు ఇది 3 లక్షల15 వేలకు చేరింది. సింగరేణి సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నందువల్లనే ఇవి సాధ్యమవుతున్నాయని గమనించాల్సి ఉంది.
 
ప్రతి ఏడాది సింగరేణి సంస్థ సమర్పించే స్పష్టమైన, లోప రహిత మైన ఆర్థిక లావాదేవీల నివేదికలను పరిశీలించిన కాగ్ కూడా గత కొన్నేళ్ళు గా తమ మెచ్చుకోలును తెలియజేస్తూ "నిల్ "కామెంట్స్ పేర్కొంటున్నారు. ఇది కూడా సింగరేణి సంస్థ నిజాయితీతో అమలు చేస్తున్న ఆర్థిక విధానాలకు గుర్తింపుగా పేర్కొనవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థ కృషిని ప్రశంసించాల్సిన వారు, అందుకు  భిన్నంగా సంస్థ కార్మికుల మనోధైర్యాన్ని, మార్కెట్లో కంపెనీకి ఉన్న విలువను, మంచి పేరును దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు అని సింగరేణి యాజమాన్యం ఆవేదన వ్యక్తంచేసింది.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిని సంస్థ యాజమాన్యం గణాంకాలతో సహా వెల్లడించింది. 
బాండ్లు , డిపాజిట్ల రూపంలో కంపెనీకి ఉన్న పెట్టుబడులు రూ. 11,665 కోట్లు  
సింగరేణి పెట్టుబడులకు వస్తున్న వడ్డీ ఏడాదికి రూ. 750 కోట్లు
273 శాతం వృద్ధితో 32,830 కోట్ల టర్నోవర్
లాభాలు 459 కోట్ల రూపాయల నుండి 500% వృద్ధితో రూ . 2300 కోట్లకు చేరిక
కార్మికుల సగటు వేతనం 234 శాతం వృద్ధి తో లక్ష 40 వేల రూపాయలు
30 శాతానికి పెంచి లాభాల బోనస్ చెల్లింపు
సోలార్ ప్లాంట్ల తో ఏటా రూ. 150 కోట్ల ఆదా
సింగరేణి  థర్మల్ ప్లాంట్ తో ఏటా  రూ. 500 కోట్ల లాభాలు


ఇది కూడా చదవండి : Vizag Steel Plant EOI Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈఓఐ బిడ్డింగ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. సింగరేణి ముందుకొచ్చేనా ?


ఆర్థికంగా సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిని గణాంకాలతో వెల్లడించిన సంస్థ యాజమాన్యం.. ఇకనైనా ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడం కనీస బాధ్యతగా గుర్తు చేస్తూ సమాచారం కావాల్సిన వారు కంపెనీ సెక్రటరీని గాని లేదా కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గానీ సంప్రదించవచ్చని యాజమాన్యం తెలిపింది.


ఇది కూడా చదవండి : Thota Chandrasekhar Press Meet: ఇది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK