కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన ఘటనపై నిరసన వ్యక్తంచేస్తూ నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు.. ‘చలో శాతవాహన యూనివర్సిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా విద్యాసంస్థలు మూసివేసి బంద్‌కు సహకరించాలని వామపక్ష పార్టీలకి అనుబంధంగా పనిచేస్తోన్న విద్యార్థి సంఘాల నేతలు యువతకు విజ్ఞప్తిచేశారు. యూనివర్శిటీలో మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన విద్యార్థులపై ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పాల్పడ్డారని ఆరోపించిన తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక (టీమాస్ ఫోరం).. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం వుందని మండిపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై చర్చించేందుకు ప్రొఫెసర్ కంచ ఐలయ్య అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించిన పలువురు వక్తలు.. అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


ఇదిలావుంటే, శాతవాహన యూనివర్శిటీ ఘటనపై స్పందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... ''బీజేపీ ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని, తక్షణమే విచారణ జరిపించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.