MLC Kavitha Gets Bail: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈడీ కేసులో బెయిల్ లభించింది. దాదాపు 164 జైలులో ఉన్నారు కవిత. దాదాపు గంటన్నరపాటు వాదనలు జరగ్గా.. చివరకు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కవిత అరెస్ట్ జరిగింది ఇలా..


ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేయగా.. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఆ వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇక ఢిల్లీ మద్యం టెండర్లకు సంబంధించి సౌత్ లాబీ తరుఫున కోట్ల రూపాయలు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్రపిళ్లైని విచారించి.. రిమాండ్ నివేదికలో కవితకు అతడిని బినామీగా పేర్కొంది. గతేడాది మార్చి నెలలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించి ఈడీ.. ఆ తరువాత మళ్లీ నోటీసులు పంపించింది. మార్చి 15న కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.


దాదాపు 164 రోజులపాటు కవిత జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఇరువైపులా వాదనలు వినింది. అనంతరం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సీబీఐ రెండ కేసుల్లోను ఆమెకు బెయిల్ మంజూరు అయింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు కవితకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.