న్యూ ఢిల్లీ: తెలంగాణలోని ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ తెలంగాణ సర్కార్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టం (2017)ను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు పాశం యాదగిరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషనర్ తరపున న్యాయవాది పి. నిరూప్ రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో మాన్యూమెంట్స్, మ్యూజియం, హెరిటేజ్ కట్టడాలు హెరిటేజ్ యాక్ట్‌లో ఉండగా... నూతన చట్టం ప్రకారం రూపొందించిన జాబితాలోంచి 132 కట్టడాలను తొలగించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తొలగించిన కట్టడాల్లో పాత అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఎర్రమంజిల్ కూడా ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
 
మాస్టర్ ప్లాన్‌లో ఆ కట్టడాలు ఉన్నందున.. వాటి పరిరక్షణ బాధ్యతలు మున్సిపల్ పరిధిలో ఉంటుందని.. కానీ కొత్త చట్టం ప్రకారం ఆ పురాతన కట్టడాలకు రక్షణ లేకుండా పోయిందని పిటిషనర్ తరపున న్యాయవాది నిరూప్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీం కోర్టు రాష్ట్ర సర్కార్‌కు నోటీసులు జారీచేసినట్టు పిటిషనర్ పాశం యాదగిరి వెల్లడించారు. ఆర్కియాలజీ యాక్ట్,హెరిటేజ్ యాక్టులోని కట్టడాలపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..