తెలంగాణలో మహాకూటమి తరఫున ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన ఈ నెల 28, 29 తేదిల్లో రాష్ట్రానికి రానున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో తెలిపారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు, అండమాన్‌లో కూడా టీడీపీ తన ఉనికిని చాటుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తెలుగువాళ్లు ఉన్న ప్రతీ చోటా తెలుగుదేశం పార్టీ ఉంటుందని..  తెలుగువారు ఎక్కడున్నా వారి సమస్యలపై చంద్రబాబు స్పందిస్తారని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబును ఈ రోజు కేసీఆర్ తిడుతుంటే ఆశ్చర్యంగా ఉందని.. కానీ అదే కేసీఆర్ చంద్రబాబును పొగుడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌ను 10 వేల కోట్ల రూపాయల నుండి 40 వేల రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదని గతంలో తెలిపారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఆనాడు చంద్రబాబు బీఫారం ఇస్తేనే మంత్రిగా సేవలందించారని.. హైటెక్ సిటీ, సైబరాబాద్ లాంటి వాటి ప్రగతికి కారణం చంద్రబాబు నాయుడి ప్రయత్నాలే అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 


కానీ ఈ రోజు చంద్రబాబు పర్యటనకు వస్తున్నారంటేనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అభద్రతాభావం, భయం పెరుగుతున్నాయని.. ఓటమి భయంతో వారు చంద్రబాబుకి తెలంగాణలో పనేంటి? వంటి ప్రశ్నలు వేస్తున్నారని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా.. ఈ సారి విజయం మహాకూటమిదే అని ఆయన తెలిపారు.