Kishan Reddy Press Meet: టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనేక ఉద్యమాల తర్వాత  ప్రజల నమ్మని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందన్నారు. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉందని.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయని ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఈ హామీల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది వేటినీ అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సమావేశం.. బీఆర్ఎస్ స్పాన్సర్ చేసిన పార్టీ అది. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. కలిసే పార్టీలే. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారు. కానీ బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు.


తెలంగాణ విమోచన దినోత్సవం రోజు హైదరాబాద్‌లో సమావేశం పెట్టుకుని.. కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితి. గత 75 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు తెలంగణ దినోత్సవ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 17న సమావేశం హైదరాబాద్‌లో పెట్టుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. 1998 నుంచి బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయాలపై జెండాలు ఎగురవేసి.. దెబ్బలు తిన్నాం. బీఆర్ఎస్ సమైక్యత దినం అని చెప్పి పెద్దల త్యాగాలను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ఏ రకంగా సమైక్యత దినం..? ఎవరి ద్వారా సమైక్యత సాధ్యమైంది..?" అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 


ఏ రకంగానైతే 15 ఆగస్టు, 26 జనవరి నిర్వహిస్తామో.. అలాగే సెప్టెంబర్ 17ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైభవోపేతంగా జరపాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విముక్తి ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో సమైక్యత పేరుతో కార్యక్రమాలా..? అని నిలదీశారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించామని.. చాలా అద్భుతంగా జరిగిందన్నారు.


"కేసీఆర్ కుటుంబానికి దేన్నీ అర్థం చేసుకునే సోయి లేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి సమైక్యతకు, విమోచనానికి తేడా తెలియదా..? ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ.. బీజేపీ మూడు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలేకుండా విభజించింది. కానీ కాంగ్రెస్ అసమర్థత కారణంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం.. పెప్పర్ స్ప్రేలు వాడేలా పరిస్థితి తలెత్తింది.. అని మాత్రమే అన్నారు. ట్విట్టర్‌లో మాత్రమే మాట్లాడతాను. ట్విట్టర్ లేకుంటే బతకలేను.. అనే వాళ్లకు వాస్తవాలు అర్థం కావు. ఆయన అమెరికా వెళ్లి నేర్చుకున్నది ట్విట్టర్ వాడటం ఒక్కటే కావొచ్చు.." అంటూ మంత్రి కేటీఆర్‌కు కిషన్ రెడ్డి చురకలు అంటించారు.


Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  


Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook