తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం ప్రస్తుతం రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం విధిస్తున్న పన్నును తగ్గిస్తే, తద్వారా తగ్గే ధర వాహనదారులు, వినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును తగ్గించే అధికారం ఉంటుందా లేదా అనేదే ప్రస్తుతానికి సందేహాలను లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో తమ ముందు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఆర్థిక శాఖ, న్యాయ శాఖ నిపుణులతో సమీక్ష సమావేశం జరుపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.    


గతంలో మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, అందులో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కూడా ఒకటని అప్పట్లో చరణ్ సింగ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఉదాహరణగా చూపిస్తూ తమ నిర్ణయాన్ని సైతం అధికారికంగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ యోచిస్తోందనేది ఆ వార్తల సారాంశం. మరి ఈ విషయంలో కేసీఆర్ అనుకున్నది సాధిస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే!