ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలోనే అందరికీ అందుబాటులో ఉండవచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 31 జిల్లాలను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తనను మరోసారి ప్రజలు ఆశీర్వదించి, అవకాశం ఇస్తే, ఈసారి గజ్వెల్ ను మరింత అభివృద్ధి చేస్తానని, ఇకపై గజ్వేల్ ప్రజలకు మరింత అందుబాటులో కొంత సమయం కేటాయిస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం గజ్వెల్ నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గజ్వెల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధి అంతటితో ఆగిపోకుండా ముందుకు పరుగులుపెట్టాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ ఓటర్లపై కేసీఆర్ వరాల జల్లు గుప్పించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, గజ్వేల్‌కు రైల్వే లైన్ తీసుకొస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 


ఈ నెల 14న తాను నామినేషన్ దాఖలు చేయనునన్నట్టు కేసీఆర్ కార్యకర్తలకు చెప్పారు. గజ్వెల్‌లో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. దుర్మార్గుల విమర్శలకు సమాధానం ఇవ్వడానికే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పి పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.