హైదరాబాద్ : తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు మరో వారం రోజులే మిగిలివుండటంతో రాజకీయ పక్షాలన్నీ ప్రచారంలో మరింత వేగం పెంచాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలతో రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటనలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కేసీఆర్ నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి సభల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం ఇల్లెందులోని జేకే కాలనీ సీఈఆర్ క్లబ్ గ్రౌండ్, కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియం, మణుగూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాంతాల పరిధిలోని మూడు నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు కోరం కనకయ్య, జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 11:30 గంటలకు ఇల్లెందు, 12:15 గంటలకు కొత్తగూడెం, 1 గంటకు పినపాక సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 


పినపాక సభ అనంతరం మధ్యాహ్నం 2:10 గంటలకు ములుగులో జరిగే సభలో పాల్గొననున్న కేసీఆర్.. ఆ తర్వాత 2:40 గంటలకు భూపాలపల్లిలో జరిగే సభకు హాజరుకానున్నారు. ములుగులో బండారుపల్లి రోడ్డులో, భూపాలపల్లిలో హైవే పక్కన బాంబులగడ్డ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో సభలు జరగనునన్నాయి. ఈ రెండు సభల అనంతరం పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లిల్లో జరిగే ప్రచార సభలకు వెళ్లనున్నారు.