తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయనున్నారా ? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు ఇవాళ మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ ప్రకటించబోతున్నారా ? ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవ్వరి నోట విన్నా ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 6న కేసీఆర్‌కి అనుకూలంగా బలమైన ముహూర్తం ఉందని, ఆరోజు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. అది ఆయనకు కలిసొచ్చేది అవుతుందని కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో వెలువడుతున్న కథనాలు అందుకు ఓ కారణం అయితే, ఆయా కథనాలకు తగినట్టుగానే కేసీఆర్ అడుగులు వేస్తుండటం మరో కారణమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవనుంది. ఈ భేటీ తర్వాత మధ్యాహ్నం 1.30కు సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారని, నేటి నుంచి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని గవర్నర్‌కి వెల్లడించచున్నారని తెలుస్తోంది. 


గవర్నర్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. మీడియా సమావేశం కన్నా ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళి అర్పించి, ఆ తర్వాత ముందస్తు ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉందనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయి, ఆయన మీడియా సమావేశంలో ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొని ఉంది.