Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేసీఆర్ డేట్ ఫిక్స్ చేసేశారా?
Telangana Elections: తెలంగాణ రాజకీయాలన్ని ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు
Telangana Elections: తెలంగాణ రాజకీయాలన్ని ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు ప్రస్తుత టీఆర్ఎస్ సర్కార్ కు గడువుంది. అయితే 2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ టీమ్ తో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తుండటంతో ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంతా భావించారు. విపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో దూకుడు పెంచాయి. 2023 మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే చెబుతూ వస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కమలం కేడర్ ను హైకమాండ్ అలర్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి.
ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చలు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్, బీజేపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన కేసీఆర్.. వాళ్లకు సవాల్ విసిరారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. తేది ఖరారు చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తానని ప్రకటించారు. విపక్షాలకు ఎన్నికల్లో తేల్చుకునే ధమ్ము ఉందా అంటూ సవాల్ చేశారు సీఎం కేసీఆర్. ప్రజల మద్దతకు తమకు ఉందని చెప్పిన గులాబీ బాస్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవడం అసాధ్యమని కామెంట్ చేశారు. దేశంలోనే సంక్షేప పథకాల్లో ముందునున్న తమకు ఓటమి భయం ఎందుకు ఉంటుందని కేసీఆర్ అన్నారు.
ఎన్నికలకు సిద్దం.. డేట్ ఫిక్స్ చేయాలంటూ విపక్షాలకు కేసీఆర్ చేసిన సవాల్ సంచలనంగా మారింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినందువల్లే కేసీఆర్ బహిరంగ సవాల్ చేశారంటున్నారు. ముందస్తు ఎన్నికల కోసమే పీకే టీమ్ తో సర్వే చేయించారని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన పీకే టీమ్ ప్రజల నాడిని పసిగట్టి కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. పీకే నివేదికపై కేసీఆర్ కసరత్తు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని డిసైడ్ అయిన కేసీఆర్.. అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలోనూ పీకే టీమ్ తో మరో సర్వే చేయించారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయంటున్నారు. గత నెలలో దాదాపు రెండు వారాల పాటు ఫాంహౌజ్ లో ఉన్నారు కేసీఆర్. ఆ సమయంలోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి... ఎమ్మెల్యేల పనితీరు.. ఎవరెవరిని మార్చాలి.. అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే అంశాలపై ఆయన లోతుగా సమాలోచనలు చేశారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. పీకే టీమ్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ముందస్తు ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసుకున్నాకే విపక్షాలకు సవాల్ విసిరారని అంటున్నారు.
ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. గుజరాత్ లేదా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.అయితే గుజరాత్ తో పాటు ఎన్నికలు జరగాలంటే ఆగస్టు లోపు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరగాలంటే ఈ ఏడాది చివరలో అసెంబ్లీని డిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న కర్ణాటక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరపాలని దాదాపుగా కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్నది కర్ణాటక, తెలంగాణే. ఈ రెండు రాష్ట్రాలకు ఓకేసారి ఎన్నికలు జరిగితే.. బీజేపీ హైకమాండ్ ఫోకస్ మొత్తం తెలంగాణ మీద ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని పీకే సర్వేలో తేలిందట. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా పెరగకుండా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళుతున్నారనే టాక్ వస్తోంది. విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వొద్దన్న ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వలస పర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ నుంచి రోజుకో లీడర్ జంప్ అవుతున్నారు. నేతల వలసలు కారు పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే దీనికి కూడా చెక్ పెట్టవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది.
READ ALSO: JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
READ ALSO: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook