KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తున్నారు. జూలై25 సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు. దీంతో ఢిల్లీలో ఈ వారం రోజులు ఏం చేశారన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. విపక్షాలు కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాయి. తెలంగాణలో కొన్ని రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ వరద పోటెత్తింది. జంట జలాశయాలకు రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉప్పొంగింది. మూసి పరివాహాక ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీలో  ఉండిపోయారు. సీఎంతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాలుకు గాయడం కావడంతో ప్రగతి భవన్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదే విపక్షాలకు అస్త్రమైంది.వరదల సమయంలో  సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ప్రధాని మోడీపైనా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో మకాం వేయడంతో జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరపుతారని అంతా భావించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎంవో ఇచ్చిన ప్రకటనలోనూ జాతీయ రాజకీయాలపై సమావేశాలు ఉంటాయని తెలిపింది. కాని వారం రోజులు ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఒకే ఒక్క రాజకీయ సమావేశం నిర్వహించారు. గురువారం ఎస్పీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేసీఆర్ నివాసానికి వచ్చారు. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. కేసీఆర్ ఈ వారం రోజుల టూర్ లో ఇదొక్కటే రాజకీయ సమావేశం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో అన్ని పార్టీల కీలక నేతలు హస్తినలోనే ఉన్నారు. కాని కేసీఆర్ మాత్రం ఏ ఒక్కరిని కలవలేదు. 


రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కేసీఆర్ కలుస్తారనే ప్రచారం సాగింది. వారం రోజులున్నా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లలేదు కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నించారా లేదా అన్నది తెలియడం లేదు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా రాష్ట్రపతి భవన్ నుంచి రియాక్షన్ రాలేదనే ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపతి ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ లో సభ పెట్టి నానా హంగామా చేశారు కేసీఆర్.  తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో కేసీఆర్ చర్చిస్తారనే ప్రచారం వచ్చింది. కాని కేసీఆర్ ఏ ఒక్క కేంద్రమంత్రిని కలవలేదు. ఇటీవల వచ్చిన వరదలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. గోదావరి వరదతో వందలాకి లంక గ్రామాలు రోజుల తరబడి నీట మునిగాయి. వర్షాలు, వరదలతో భారీగానే నష్టం జరిగిందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. అయితే వారం రోజులు హస్తినలో ఉన్న కేసీఆర్ వరద సాయం గురించి కూడా కేంద్ర పెద్దలను కలిసి వివరించలేదు.


ఢిల్లీలో వారం రోజులు కేసీఆర్ ఏం చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. విపక్షాలు ఇదే ప్రశ్నిస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు మాత్రం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు, నిధులు, అప్పులపై కొత్తగా విధించిన ఆంక్షల విషయంలో చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చారని అంటున్నారు. రాష్ట్ర అధికారులను దిశానిర్దేశం చేశారని.. కేంద్రంతో అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని చెబుతున్నారు. డిస్కంలకు సంబంధించి కేంద్రం నిలుపుదల చేసిన 10 వేల కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. కేసీఆర్ ఢిల్లీలో కూర్చుని అధికారులతో డైరెక్షన్ ఇవ్వడం వల్లే ఆర్థిక అంశాలకు సంబంధించి తెలంగాణకు ఊరట లభించిందని అంటున్నారు. మరోవైపు  కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనే వార్తలు వస్తుండటంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఆగస్టు నెలలో అయినా తమకు ఒకటో తారీఖున వేతనం వస్తే చాలని వాళ్లంతా ఆశపడుతున్నారు. జూలై నెలలో కొందరు ఉద్యోగులకు 15వ తేదీ వరకు వేతనం అందలేదు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ రచ్చగా కేంద్రంగా మారుతోంది. 


Also Read: Jabardasth: జబర్దస్త్ లో కొత్త యాంకర్ ఎంట్రీ.. ఆ హాట్ భామకే అవకాశం?


Also Read:M.S. Rajashekhar Reddy: కులాల కుంపటి.. సొంత సినిమా ఈవెంట్ కే రాలేని పరిస్థితుల్లో నితిన్ డైరెక్టర్!


నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook