ఆరోగ్యశ్రీని కేంద్రం కాపీ కొట్టింది : కేసీఆర్
ఆరోగ్యశ్రీని కేంద్రం కాపీ కొట్టింది : కేసీఆర్
మిర్యాలగూడ: ప్రధాని నరేంద్ర మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ కొట్టి ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, కానీ ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ ఎన్నోరెట్లు మేలు అని కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వేల ఆధారంగా పరిశీలిస్తే, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 150 సీట్లు, యూపీఏకి 100 సీట్లకు మించి రావని తెలిసిందని చెప్పిన కేసీఆర్.. మే తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పరిపాలిస్తాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోతారని ఎద్దేవా చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో చిత్రవిచిత్రమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో మంది వున్నారని అన్నారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క స్థానం గెలిచినా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వాళ్ల శపథాలు నిలపెట్టుకోలేదని ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. మొత్తానికి మిర్యాలగూడ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.