''ఆర్టీసి సమ్మె మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కార్మిక సంఘాలుగా చెప్పుకునే వారు చేస్తున్న ప్రకటనలకు భయపడే ప్రసక్తే లేదు'' అని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సమ్మెను ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు.. వారి బెదిరింపులకు భయపడదు అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. సమ్మెతో సంబంధం లేకుండా బస్సులు నడిపి, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నారు. బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద బస్సులను ఆపి అరాచకం సృష్టిద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. ఇక్కడ ఎవ్వరి గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు కాస్తంత ఉదాసీనంగా వ్యవహరించిన ప్రభుత్వం.. ఇకపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసి ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయానికొచ్చినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : 19న తెలంగాణ బంద్.. కార్మికుల భవిష్యత్ కార్యాచరణ


ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. బందోబస్తులో మహిళా పోలీసులు కూడా ఉండేలా చూసుకోవడంతోపాటు మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించి నిఘా పెంచాలని ఆదేశించారు. ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టించాలని చూస్తే.. వారిపై కేసులు పెట్టి కోర్టుకు పంపాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సమీక్షా సమావేశం నుంచే రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మరీ ఆదేశాలు జారీచేశారు.


Related news : వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్