సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల అంశంపై చర్చ ?
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. ఏపీ భవన్ తెలంగాణకే దక్కాలని డిమాండ్ ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో రేపు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశం అవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అధికారవర్గాలు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలు, వాటి పరిష్కారం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు రూపొందించింది. ఇటీవలే తెలంగాణ కేబినెట్ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ కొత్త జోనల్ వ్యవస్థకు అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసుచేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరనున్నారని తెలుస్తోంది. అలాగే 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలు కూడా ప్రధానితో భేటీలో చర్చకు రానున్నాయి.
ఏపీ భవన్ తెలంగాణదే :
ఢిల్లీలో ఉన్న ఏపీభవన్ మొత్తం భూభాగం తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, ఏపీ భవన్‌ని పూర్తిగా తమకే కేటాయించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరనున్నట్టు తెలుస్తోంది. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అప్పట్లోనే హైదరాబాద్ హౌజ్‌కి బదులుగా ఏపీ భవన్ భూమిని కేటాయించిందని, అందువల్ల ఏపీ భవన్ అంతా అప్పటి నిజాం ప్రభుత్వానిదే అవుతుందని మోదీ ముందు ఓ ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు:
మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించిన విషయాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇకనైనా కేంద్రం ఈ రిజర్వేషన్ల అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం.
ఏపీ భవన్, మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతోపాటు తెలంగాణ రైతాంగానికి చేయూత, పూర్తి స్థాయిలో హై కోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు, నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సి ఉన్న ఆర్థిక సహాయం వంటి కీలక అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం.
నీతిఆయోగ్ సమావేశానికి హాజరు:
ఈ నెల 17వ తేదీన ఢిల్లీలోనే జరిగే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నీతిఆయోగ్ ఆహ్వానాలు పంపించినందున సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాతే తెలంగాణకు తిరిగి రానున్నట్టు సమాచారం. ఏదేమైనా పలు కీలక సమస్యలకు పరిష్కారాలు డిమాండ్ చేయడంతోపాటు పలు కీలక ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్తున్నందున సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.