Jagga Reddy: జగ్గారెడ్డి రూటే సెపరేటు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు.. ప్రత్యేక ధన్యవాదాలు...
Congress MLA Jagga Reddy praises CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Congress MLA Jagga Reddy praises CM KCR: ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ విన్నా కొలువుల జాతర టాపిక్కే ఎక్కువగా వినిపిస్తోంది. నిన్న సాయంత్రం వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచి.. అసెంబ్లీలో నేడు ఆయన ఏం చెప్పబోతున్నారోనని తెలంగాణ నిరుద్యోగులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. చెప్పినట్లుగానే నిరుద్యోగుల ఎదురుచూపులకు తెరదించుతూ 80,093 ఉద్యోగాలకు ఇవాళే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి, వీహెచ్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీఆర్ ప్రకటనపై విమర్శలు గుప్పించగా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం కేసీఆర్ ప్రకటనను స్వాగతించారు.
ఒక ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నిరుద్యోగుల కోసం సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేనిదే పనిచేయదని పేర్కొన్నారు. అదే సమయంలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ను పున:ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానని.. దీనిపై రేపు సీఎంతో చర్చించేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరుతానని తెలిపారు. తెలంగాణలో ఈరోజు అందుతున్న ఫలాలకు సోనియా, రాహుల్ గాంధీల కృషే కారణమన్నారు. తెలంగాణ నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు.
కాగా, ఇదే ఉద్యోగ నోటిఫికేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటన నిరాశకు గురిచేసిందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి ప్రశ్నించారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 80వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఓట్ల కోసమే సీఎం కేసీఆరే ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన చేశారని విమర్శించారు.
అంతకుముందు, మరో కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ కూడా ఇవే విమర్శలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు కాబట్టే ఈ ప్రకటన చేశారని చెప్పారు. ఓవైపు కోమటిరెడ్డి, వీహెచ్ కేసీఆర్ ప్రకటనను ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తుంటే.. జగ్గారెడ్డి మాత్రం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook