Telangana Exit Poll Result 2023: అసెంబ్లీ స్థానాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..? (పార్ట్-2)
Telangana Exit Poll District Wise Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాల వారీగా సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
Telangana Exit Poll District Wise Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ యుద్ధం ముగిసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గురువారం తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఓటర్లు భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పూర్తిస్థాయిలో రిపోర్ట్ వెల్లడికావాల్సి ఉంది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వత్రా ఉత్కంఠ రేపిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్‌కు మొగ్గు చూపగా.. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టారు. మరికొన్ని సర్వేల్లో హంగ్ ఏర్పడుతుందని తేలింది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని అందరిలోనూ ఆసక్తి ఉంది. గ్రౌండ్ లెవల్‌లో ఓటరు మాట ఎలా ఉంది..? ఎవరు గెలిచే అవకాశం ఉంది..? ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల వివరాలు మీ కోసం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 13 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. 6 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్, 5 నుంచి 6 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంది. కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి ఆధిక్యం కనబరిచే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, వనపర్తి, కొల్లాపూర్, అలంపూర్, అచ్చంపేటలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచే అవకాశం ఉంది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క 7 వేల నుంచి 8 వేల వరకు ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంది. జడ్చర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ టైట్ ఫైట్ ఉంది. మక్తల్ స్థానంలో కాంగ్రెస్‌కు మొగ్గు ఉంది. నారాయణపేట స్థానంలో బిగ్‌ఫైట్ నడుస్తోంది. దేవరకద్ర బీఆర్ఎస్, షాద్‌నగర్ బీఆర్ఎస్, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్, గద్వాల్ నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. ఐదు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచనుందని సర్వేలు చెబుతున్నాయి. మూడుస్థానాల్లో కాంగ్రెస్, ఒకస్థానంలో బీఆర్ఎస్, ఒక స్థానంలో బీఎస్పీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ స్థానంలో మున్నూరు కాపు ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కి లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. మంత్రి జోగు రామన్నకు ఇది నెగిటివ్‌గా మారనుంది. నిర్మల్‌లో బీజేపీ, ముధోల్‌లో బీజేపీ, బోథ్ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖానాపూర్‌లో త్రిముఖ పోరు నెలకొంది. కాస్త ఎడ్జ్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆధిక్యం వచ్చే ఛాన్స్ ఉంది. చెన్నూర్ కాంగ్రెస్, బెల్లంపల్లిలో కాంగ్రెస్, మంచిర్యాల కాంగ్రెస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చనున్నట్లు సర్వేల్లో తేలింది.
ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఇలా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 8-9 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆలేరు బీర్ల ఐలయ్య యాదవ్ (కాంగ్రెస్), నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్), హుజూర్‌నగర్, కోదాడ స్థానాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు (కాంగ్రెస్), సూర్యాపేట మంత్రి జగదీశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), భువనగిరిలో నువ్వా నేను అన్నట్లు పోటీ ఉంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ కాంగ్రెస్, మిర్యాలగూడలో టఫ్ ఫైట్ ఉండనుంది. నకిరేకల్‌లో వేముల వీరేశ్ (కాంగ్రెస్) గెలుపొందే ఛాన్స్ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంది.
(మిగిలిన జిల్లాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయంది.. పార్ట్-1, పార్ట్-3)