హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం కాలం నుంచే రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలందించిన ఈఎస్ఎల్ నరసింహన్‌ నేడు పదవిని వీడిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఎయిర్‌పోర్టుకు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి వీడ్కోలు పలికారు. అంతకన్నా ముందుగా నరసింహన్ దంపతులు ఎయిర్‌పోర్టులోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంతో గవర్నర్‌గా నరసింహన్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎక్కువ కాలంపాటు ఆ హోదాలో సేవలందించిన గవర్నర్‌గానూ నరసింహన్ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్ భవన్ నుంచి వెళ్లిపోతున్న క్రమంలో రాజ్ భవన్ కార్యాలయ సిబ్బంది సైతం ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అందరికన్నా చివరిగా నరసింహన్ దంపతులకు పుష్పగుచ్చం అందించి వీడ్కోలు పలికిన సీఎం కేసీఆర్.. నరసింహన్ దంపతులు ప్రత్యేక విమానం వెళ్లేవరకూ అక్కడే నిలబడి దగ్గరుండి సాగనంపారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నరసింహన్ దంపతులు బెంగళూరు వెళ్లారు.


తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపి చీఫ్ తమిళిసై సౌందరరాజన్‌ని కేంద్రం నియమించిన నేపథ్యంలో చాలాకాలంగా ఆ పదవిలో కొనసాగుతూ వచ్చిన ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.